తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కట్టడి, బాధితుల అవసరాలకు అనుగుణంగా వైద్య, ఇతర సేవలు అందించేందుకు, 104 అభ్యర్థనల పూర్తిస్థాయి పరిష్కారానికి కలెక్టర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఆదర్శనీయమైన వార్‌రూమ్ కాన్సెప్ట్ ను రూపొందించి, అమలు చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరులతో కలిసి మంత్రి వేణుగోపాలకృష్ణ తుని ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి కోవిడ్ బాధితులతో మాట్లాడి వైద్య, ఇతర సేవల గురించి అడిగి తెలుసుకొని వారిలో ధైర్యం నింపారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 104 కాల్స్ పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తూ జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రోగులకు ట్రాక్‌షీట్లు రూపొందించి, నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్ నిర్ధారణ అయిన దగ్గరి నుంచి ఆక్సిజన్ స్థాయిలు, ఔషధాల వినియోగం ఇలా ప్రతి అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో జేఎన్‌టీయూ, బోడసకుర్రు, బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఆరువేల వరకు పడకలు ఉన్నాయని, ఆందోళన చెందకుండా ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అన్ని వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, జీహెచ్ఎల్, కిమ్స్ అమలాపురం తదితర ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్య సంరక్షణకోసం, కోవిడ్ కట్టడికి నిరంతరం కృషిచేస్తున్నారని.. జిల్లా యంత్రాంగం 24X7 పనిచేస్తూ బాధితులకు అవసరమైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రోజుకు దాదాపు పదివేల వరకు ఫోకస్డ్‌గా, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయడం వల్ల అధిక కేసులు నమోదవుతున్నాయన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అపోహలు, వదంతులను నమ్మవద్దని.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోందని, లక్షణాలను వీలైనంత త్వరగా గుర్తించి, వైద్య సిబ్బంది సూచనల మేరకు మందులు ఉపయోగిస్తే హోం ఐసోలేషన్‌లోనే ఉండి కోలుకోవచ్చని తెలిపారు. తుని ఏరియా ఆసుపత్రిలో 100 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని.. కోవిడ్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో పర్యటన చేసినట్లు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
దివీస్‌కు అభినందనలు:
సామాజిక బాధ్యతగా బాధితులకు సేవలందించడంలో తమ వంతు భాగస్వామ్యం అందించాలనే ఉద్దేశంతో దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ తాజాగా 60 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి చేతులమీదుగా వైద్యాధికారులకు అందించింది. తుని ఏరియా ఆసుపత్రికి 50, తొండంగి, కోటనందూరు పీహెచ్‌సీలకు అయిదు చొప్పున కాన్సంట్రేటర్లను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా దివీస్ సంస్థను మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్, జేసీ (డీ) తదితరులు అభినందించారు. జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. దివీస్ ఇప్పటికే ఈ నెల 19న జిల్లాకు 40 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించింది. కార్యక్రమంలో దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ అడ్మిన్ హెడ్ ఆర్.సుధాకర్, మేనేజర్ బి.వాసుబాబు, డీసీహెచ్ఎస్ డా. రమేష్‌కిశోర్, వైద్య, ఆరోగ్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.