ఐసోలేషన్ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి..
Ens Balu
1
Srikakulam
2021-05-22 07:11:10
గ్రామ స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ మండల అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వసతి సౌకర్యాలు మేరకు పాఠశాలలు, కళాశాలలలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో చిన్న గదుల్లో అందరు కుటుంబ సభ్యులు ఉండటం వలన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పటికీ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. అటువంటి వారిని గ్రామ ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టాలని ఆయన సూచించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు బహిరంగ మలవిసర్జన వంటి కార్యక్రమాలకు బయటకు వస్తున్నట్లు సమాచారం ఉందని, గ్రామ ఐసోలేషన్ కేంద్రాల్లో పెట్టడం వలన అటువంటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు. బయట తిరగటం వలన ఇతరులకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గ్రామ స్థాయిలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పటిష్టమైన చర్యలు అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సర్పంచ్ అధ్యక్షతన గల గ్రామ స్థాయి యాజమాన్య కమిటీ అన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గ్రామాల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచుగా శుభ్రపరచుకోవడం అనే ప్రాథమిక అంశాలపై ఎక్కువగా అవగాహన ఉండాలని ఆయన వివరించారు. మాస్కు రక్షణ కవచంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. దీనిపై గ్రామస్థాయి కమిటీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలని, పలు కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఎటువంటి రాజీలేని ధోరణిలో వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొంటూ పారిశుద్ధ్య కమిటీ నిధులు లభ్యంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పనులకు పాజిటివ్ వ్యక్తులు హాజరు కాకుండా చూడాలని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలపై తగు దృష్టి కేంద్రీకరించాలని, కరోనా వ్యాప్తి నివారణకు అన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.