యాష్ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రధానంగా లోతట్టు, తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. యాష్ తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ విభాగాలు చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేసేందుకు శనివారం సాయంత్రం ఆయన జిల్లా స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభాగాల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తుఫాను ప్రభావం ఉంటుందని ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ముందుగా తీర ప్రాంతాల గ్రామ ప్రజలను, లోతట్టు ప్రాంతాల్లో నివశించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తుఫాను షెల్టర్‌ల పరిస్థితిని సమీక్షించాలన్నారు. అలాగే గజ ఈతగాళ్లను, మోటార్ బోట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఫిషరీస్ ఉప సంచాలకులను ఆదేశించారు. స్థానికంగా మండల కేంద్రాల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని విభాగాధిపతులు ఆయా విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేయాలని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయటం ద్వారా అప్రమత్తం చేయాలని సూచించారు. నష్టాల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని, రైన్ ఫాల్ వివరాలను ముందుగా అందజేయాలని సీపీవో విజయలక్ష్మిని ఆదేశించారు. ఒడిశా ప్రాంత రైన్ ఫాల్ కూడా అందజేయాలని, దీని ద్వారా నాగావళి నది ఉద్ధృతిని అంచనా వేసి ముందస్తు చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ నాగావళి ఉద్ధృతిని అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, ట్యాంకులను ముందుగా పరిశీలించి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు వహించాలని డ్వామా, సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే తుఫాను ప్రభావం ఉండే ఈ నాలుగు రోజుల్లో నిత్యవసర సరకుల పంపిణీకి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్‌వో పాపారావుకు చెప్పారు. 24 గంటల్లో గ్రామీణ ప్రాంతాలకు సరకులను తరలించేయాలని ఆదేశించారు. వైద్య పరమైన సమస్యలు తలెత్తకుండా ముందుగానే అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, సిబ్బందిని స్థానికంగా ఉండేలా చూడాలని డీఎం & హెచ్‌వో రమణ కుమారిని ఆదేశించారు. ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నమవకుండా మున్సిపాలిటీ, డీపీవో, పంచాయతీ రాజ్ అధికారులు తగిన శానిటేషన్ చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యుత్ పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఈపీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. పంట నష్టం జరగకుండా స్థానిక ఆర్బీకేల ద్వారా రైతులను అప్రమత్తం చేయాలని, పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకొనేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీకి సూచించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా గ్రామీణ తాగునీటి పారుదల అధికారులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. హామ్ రేడియోలను సిద్ధం చేయాలని డీపీఎంకి సూచించారు. ఆర్టీసీ, అగ్నిమాపక తదితర శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. తహిశీల్దార్ల ఆధ్వర్యంలో మండలాల వారీగా నష్టాల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి అందజేయాలని సూచించారు. అనంతరం ఒక్కో విభాగ అధికారి వారు తీసుకొనే చర్యలను వివరించారు.
ఆక్సీజన్ తరలింపులో ఇబ్బంది రానివ్వకండి
కరోనా రోగులకు ఆక్సీజన్ను తరలిస్తున్న వాహనాల రాకపోకలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా చెట్లు కూలి లేదా ఇతర కారణాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినా.. రాకపోకలు నిలిచిపోయినా స్థానిక పోలీసు, ఇతర విభాగాల అధికారుల సాయంతో పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పారు. స్థానికంగా రెవెన్యూ అధికారుల పరిధిలో జేసీబీలను, ఇతర సహాయక సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఫైర్ విభాగ అధికారులు రోప్‌లను, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు.
పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు చేయండి
తుఫాను ప్రభావం అయిన గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తక్షణమే తరలించేందుకు తగిన విధంగా ముందుగానే సిద్దంగా ఉండాలని చెప్పారు. స్థానికంగా ఉండే సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. పాఠశాలలు, ఇతర భవనాలను పునరావాస కేంద్రాలుగా సిద్ధం చేయాలన్నారు. అలాగే వసతులను సమకూర్చాలని సూచించారు. ఆహారం, తాగునీరు తదితర సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు.
సమావేశంలో జేసీలు కిశోర్ కుమార్, మహేష్ కుమార్, వెంకటరావు, పార్వతీపురం సబ్‌కలెక్టర్ విధేహ్ ఖరే, పీవో కూర్మనాథ్, డీఆర్వో గణపతిరావు, ఆర్డీవో భవానీ శంకర్, సీపీవో విజయలక్ష్మి, ఈపీడీసీఎల్ ఎస్ఈ విష్ణు, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్ఈ రవికుమార్, ఫిషరీస్ డీడీ నిర్మలా కుమారి, వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి, మున్సిపల్ కమిషనర్ వర్మ, డీఎస్‌వో పాపారావు, హార్టికల్చర్ డీడీ శ్రీనివాసరావు, తహిశీల్దార్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.