యాష్ తుపానుపట్ల అప్రమత్తంగా ఉండాలి..


Ens Balu
2
Kakinada
2021-05-23 04:33:09

ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24వ తేదీ నాటికి తుఫానుగా మారి వాయువ్య దిశలో పయనించి 26వ తేదీన ఒడిశా-పశ్చిమ బెంగాల్ మద్య తీరాన్ని తాకనుందని, దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో గణనీయమైన వర్షపాతం కురియవచ్చని భారత వాతావరణ శాఖ సూచన జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలిపారు.  “యాష్”  గా నామకరణం చేసిన ఈ తుఫాను హెచ్చరిక నేపద్యంలో జిల్లాలోని మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకూ తూర్పు, ఉత్తర బంగాళాఖాతంలోకి, ఒడిశా-బెంగాల్ తీరాల వైపు సముద్రంలోకి వెళ్లవద్దని, లోతైన సముద్ర వేటలో ఉన్న వారు వెంటనే తిరిగి తీరానికి చేరుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా మత్స్సకారులందరికీ సమాచారం అందించి, సముద్ర వేటలో ఉన్నవారిని వెనుకకు రప్పించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే తుఫాను కారణంగా ఎక్కవ వర్షపాతం నమోదైయ్యే సూచన దృష్ట్యా జిల్లాలోని రైతులను అప్రమత్తం చేసి, ధాన్యం, పంటలకు నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.  డివిజనల్, మండల అధికారులు తమ కార్యాలయాల్లో కంట్రోలు రూమ్ లు ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత చర్యలను చేపట్టాలని తెలిపారు. సముద్ర తీర మండలాల్లోని అన్ని గ్రామాల్లో దండోరా, వలంటీర్ల ద్వారా ప్రజలకు తుఫాను సమాచారం తెలిపి అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్దం చేయాలని, ఏవిధమైన ప్రాణ, ఆస్తి, పంట నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 
సిఫార్సు