ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా, బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలని కాంక్షిస్తూ.. విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)కి సోమవారం ధన్వంతరీ హోమం నిర్వహిస్తున్నట్టు దేవస్థాన ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాకు ఆదివారం ఒక ప్రకటనల విడుదల చేశారు. ప్రజలు అనారోగ్యం, వైరస్ లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఆ సింహాద్రినాథుని చల్లని చూపులు ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా అవసరమన్నారు. ప్రజలకు చక్కటి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకుంటూ.. శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామికి ధన్వంతరి హోమం నిర్వహించాలని ఆలయ ధర్మకర్త సంచయిత గజపతి, అర్చకులతో కలిసి నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 24న స్వామి వారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమం కూడా చేపడుతున్నామన్నారు. ఈ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేని కారణంగా ఆన్ లైన్ ద్వారా రూ.2,500 రుసుము చెల్లించి భక్తులు పాల్గొనే అవకాశం కల్పించామని చెప్పారు. దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam 11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు. ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు 6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా పంపించాల్సి వుంటుందన్నారు. భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.