కోవిడ్ చికిత్స పొందిన వారిలో ఇటీవలి కాలంలో వ్యాపిస్తున్న బ్లాక్ ఫంగస్(మ్యుకరో మైకసిస్) వ్యాధి చికిత్సకోసం అవసరమైన ఔషధాలు జిల్లాలో అందుబాటులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తుల చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లు, మాత్రలు జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు చేరినట్టు వెల్లడించారు. టొసిలిజుమాబ్ 80 మిల్లీ గ్రాముల ఇంజక్షన్లు- 140, ఏంపోటెర్సిన్-బి 50 మిల్లీగ్రాముల ఇంజెక్షన్లు- 30, పొసకొనజోల్ 300 మి.గ్రా. ఇంజక్షన్లు- 30, పొసకొనజోల్- 100 మి.గ్రా. పరిమాణం గల మాత్రలు -1000 వంతున రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లాకు సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లాలోని బ్లాక్ ఫంగస్(మ్యుకరో మైకసిస్) వ్యాధి సోకినట్లుగా గుర్తించిన వారికి ఈ మందులు అందజేసి చికిత్స చేయడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని బ్లాక్ ఫంగస్ కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో సంప్రదించాలని సూచించారు.