యాస్ తుపాను కోసం ప్రత్యేక కాల్ సెంటర్..
Ens Balu
2
Vizianagaram
2021-05-23 08:32:09
యాస్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో సాగర, స్వదేశీ మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని.. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ రక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజయనగరం మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మీడియాకి ప్రకటన జారీ చేశారు. యాస్ తుపాను హెచ్చరికల సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.హరిజవర్ లాల్ ఆదేశాల మేరకు 24గంటలు పనిచేసే కాల్ సెంటర్ జిల్లా కార్యాలయంలో 08922-273812 అనే నెంబరుతో ఏర్పాటు చేసినట్టు ఆమె పేర్కొన్నారు. 9440814722లో మత్స్యశాఖ ఉపసంచాలకులు, 9490835709 లో మత్స్యశాఖ సహాయ సంచాలకులు, 8247586549లో మత్స్యశాఖ అభివ్రుద్ధి అధికారి అందుబాటులో ఉంటామని వివరించారు. ముందస్తు చర్యగా గజఈతగాళ్లను, రిలీఫ్ బోట్లను సిద్దం చేసినట్టు కూడా తెలియజేశారు. సాగర మిత్రాల ద్వారా తుపాను హెచ్చరికలు జారీచేయడంతోపాటు దండోరాలు కూడా వేయించి మత్స్యాకారులకు తాజా పరిస్తితిని తెలియజేశామన్నారు. తీర ప్రాంతాల్లో బోట్లు, వేట సామాన్లు తుపాను తాకిడి పాడైపోకుండా, ఇస్తి నష్టం జరగకుండా జాగ్రత్త చేసుకోవాలని కూడా సమాచారం అందించినట్టు చెప్పారు. తుపాను తీవ్రత తగ్గేవరకూ అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు ఇచ్చేది లేదని పేర్కొన్నారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కాల్ సెంటర్ కి సమాచారం అందించాలని, లేదంటే సాగర మిత్రాలను సంప్రదించి సహాయం పొందాలని మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి ఆ ప్రకటనలో కోరారు