యాస్ తుపాను పై యంత్రాంగం అప్రమత్తం..


Ens Balu
3
Srikakulam
2021-05-23 12:15:56

యాస్ తుఫాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రతి నిత్యం  అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసున్నారు. ఆదివారం కూడా యాస్ తుపాన్ పై సంబంధిత అధికారులతో  జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెక్కలి డివిజన్ మండలాలు అధికంగా తుఫానుకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ పునరుద్ధరణ, వైద్య శిబిరాలు ఏర్పాటు తదితర అంశాలపై  పూర్తి సంసిద్ధత ఉండాలని ఆయన ఆదేశించారు. పంటల భద్రత గూర్చి రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. శాఖల వారీగా అధికారులు చేపట్టాల్సిన అంశాలపై ఆదేశాలు ఇచ్చారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆయన స్పష్టం చేసారు. తుఫాన్ ప్రభావిత గ్రామాలలో దండోరా వేయించాలని ఆయన ఆదేశించారు. గ్రామాలలో తీవ్రమైన గాలులు వీచే అవకాశం వున్నందున, తప్పనిసరి పరిస్థితులలో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు రవాణా సౌకర్యాలు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. తుఫాను రక్షిత భవనములలో నీరు, విధ్యుత్ జనరటర్ మొదలగు సదుపాయాలను సిద్ధం చేయాలని అన్నారు. ఎం.ఎల్.ఎస్ పాయింట్స్, చౌక ధరల దుకాణాలలో ఉన్న నిత్యావసర సరుకులను పునరావాస కేంద్రాలకు అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. పునరావాస కేంద్రాలు ఆహార పదార్థాలు తయారు చేయుటకు అంగన్వాడి వర్కర్స్ ను సంసిద్ధం చేయాలని, పునరావాస కేంద్రాలలలో చిన్న పిల్లలకు టెట్రా ప్యాక్ పాలు అందించు ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాను ఒడిసా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటనుందని దాని ప్రభావం టెక్కలి డివిజన్ మండలాలు -  ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, మందస, వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాలి వరకు గల మండలాలలో ఉంటుందని అన్నారు. వాటితో పాటు తీర ప్రాంత మండలాలు - శ్రీకాకుళం, గార, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, పోలాకి మండలాల అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో  టెలి కమ్యూనికేషన్స్ సంబంధిత టవర్స్ వద్ద జనరేటర్ లు, సరిపడ డిజిల్ నిల్వలు ఉండేటట్లుగా సంబంధిత నెట్వర్క్ ఏజెన్సీ లతో మాట్లాడి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో చెట్లు కూలితే వెంటనే రోడ్ క్లియరెన్స్ చేయుటకు అవసరమగు జె.సి.బిలను, విద్యుత్ రంపాలను సిద్ధం చేయాలని అన్నారు. ట్రాక్టర్ లు, డిజిల్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు.  పూరి గుడిసెలలో నివాసం ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుఫాన్ అనంతరం వరదలకు అవకాశం ఉంటుందని, నది పరివాహక మండలాలు,  గ్రామాలలో వి.ఆర్.ఓలు, వి. ఆర్.ఎ లు పోలీస్ లతో సమన్వయం ప్రజలు నదులు, వాగులు, వంకలు దాటకుండా చూడాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు  సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్,  మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ మశిలామని, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు