యాస్ తుపాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు..


Ens Balu
5
Srikakulam
2021-05-23 12:25:35

శ్రీకాకుళం జిల్లాలో అన్ని మండలాల్లో  తహసిల్దార్ కార్యాలయాలలో తక్షణం 24 గంటలు పనిచేసే యాస్ తుపాన్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్  జె.నివాస్ అధికారులను ఆదేశించారు.  రెవిన్యూ, విద్యుత్, గ్రామీణ నీటి పారుదల, తదితర శాఖల ఉద్యోగులతో షిప్ట్ లు వారీగా విధులు నిర్వహించాలని అన్నారు. అత్యవసర సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ నెం 08942-240557 నంబరుకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. (e-mail id : cosklmsupdtd@gmail.com) ప్రదానమైన నీటి సరఫరా పథకాల వద్ద జనరేటర్ లు ఏర్పాటు చేసి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా  చర్యలు తీసుకోవాలని ఆర్.డబ్ల్యు.ఎస్ పర్యవేక్షక ఇంజినీర్ టి.శ్రీనివాసరావు ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అవసరమైతే మంచినీటి కులాయిలు, బోర్ వెల్స్ మరమ్మతులు చేయించుటకు విడి పనిముట్లు సిద్దంగా ఉంచాలని పేర్కొన్నారు. విద్యుత్తు వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతుందని అందుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్తు స్తంభాలను వెంటనే పునరుద్ధరణ చేయుటకు అవసరమైన రవాణా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. తుఫాన్ ప్రభావంగల ఇచ్చాపురం, మందస, కవిటి, సోంపేట, వజ్రపు కొత్తూరు,  సంతబొమ్మాలి,  పోలాకి,  గార,  శ్రీకాకుళం,  ఎచ్చెర్ల, రణస్థలం మండలాలలో అవసరానికి అనుగుణముగా వైద్య శిబిరాలు నిర్వహించుటకు కావలసిన అన్ని  మందులు, బావులు, బొర్ లను క్లోరినేషన్ చేయుటకు క్లోరిన్ టాబ్లెట్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అత్యవసర సేవలకు ఆటంకం కలుగ కుండా జనరేటర్ లు , విద్యుత్ ప్రత్యమ్నాయాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

తుఫాన్ ప్రభావిత గ్రామాలలో పారిశుధ్యం, బావులు, బోర్లు మొదలగు వాటిలో క్లోరినేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను తక్షణం కోసి భద్రపరచు కోవడం లేదా కోయకుండా ఉండటం చేయాలని అన్నారు. గ్రామాలలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు తగు సూచనలు చేయాలని ఆదేశించారు. జీడి, మామిడి, కొబ్బరి పంటలకు నష్టం కలుగుటకు అవకాశం వున్నందున రైతులకు తగు సలహాలు అందించారలని చెప్పారు. 

నేటి నుండి 9వ విడత ఫీవర్ సర్వే : కోవిడ్ ను గూర్చి మాట్లాడుతూ సోమవారం నుంచి 9వ విడత ఫీవర్ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఉపాధి హామీ పనులు కల్పించరాదని ఆయన ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు  సుమిత్ కుమార్, డాక్టర్ కె. శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్,  మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి.వి.శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ మశిలామని, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు