కోవిడ్ కట్టడి చర్యలతో పాటు రోగులకు వైద్య, ఇతర సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయం అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా రొయ్యల హేచరీల అసోషియేషన్ ముందుకొచ్చింది. సోమవారం కోవిడ్ సహాయ నిధికి జిల్లా రొయ్యల హేచరీల అసోషియేషన్ అధ్యక్షులు ఎస్.వీర్రెడ్డి, అఖిల భారత రొయ్యల హేచరీల అసోషియేషన్ కార్యదర్శి మధుసూధన్‌రెడ్డి.. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో రూ.50 లక్షల చెక్కును కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి అందజేశారు. రెండోదశలో కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో సామాజిక బాధ్యతగా కోవిడ్ సహాయ నిధికి విరాళం అందించిన జిల్లా రొయ్యల హేచరీల అసోషియేషన్‌కు కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజల తరఫున అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ విపత్తు సమయంలో ప్రజలకు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చి, విరాళం అందించిన తూర్పుగోదావరి జిల్లా రొయ్యల హేచరీల అసోషియేషన్‌కు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సాయమందించేందుకు ఇప్పటికే పలు కార్పొరేట్, వాణిజ్య, వ్యాపార సంస్థలు విరాళాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య పరికరాలు వంటివి అందించాయని, మరింత మంది దాతలు ముందుకొచ్చి కోవిడ్ సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ జేడీ పీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.