తూర్పు గోదావరిజిల్లా కలెక్టరేట్‌లోని వికాస (శిక్షణ, ప్లేస్‌మెంట్ సేవలు) విభాగం ద్వారా వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన యువత కోవిడ్ సహాయక చర్యలకు తమ వంతు సాయం అందించే ఉద్దేశంతో రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చింది. ఈ మేరకు సోమవారం వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్, సిబ్బంది దాదాపు రెండు లక్షల రూపాయల విలువచేసే 9 లీటర్ల సామర్థ్యంగల రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జేసీ (డీ) కీర్తి చేకూరి తదితరులకు అందజేశారు. వికాస నిర్వహించిన జాబ్‌మేళాల ద్వారా రిటైల్, రవాణా, మార్కెటింగ్, ఐటీ తదితర సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందిన యువతీయువకులు రోగులకు ప్రాణ వాయువును అందించే కాన్సంట్రేటర్లను అందించడం గొప్ప విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జీజీహెచ్ కోవిడ్ నోడల్ అధికారి సూర్యప్రవీణ్‌చాంద్, వికాస పీడీ కె.లచ్చారావు తదితరులు పాల్గొన్నారు.