యాస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి..
Ens Balu
2
Pusapatirega
2021-05-24 12:37:18
యాస్ తుపాను పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్.నిర్మలకుమారి మత్స్యకారులకు సూచించారు. సోమవారం పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీర ప్రాంతాలైన చింతపల్లి, పతివాడ బుర్రిపేట, తిప్పలవలస, ముఖం, పెద్దకొండరాజుపాలెంలోని ఆమె స్వయంగా పర్యటించి మత్స్యకారులకు తుపాను వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ అవగాహన కల్పించారు. అదేసమయంలో గజఈతగాళ్లంతా సిద్దంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. మత్స్యకార ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లను కూడా ఆమె పరిశీలించారు. తుపానును ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మత్స్యశాఖ కార్యాలయంతోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారని, ఎప్పుడు ఏ అత్యవసర సమయం వచ్చినా ఆ నెంబర్లుకు ఫోన్లు చేసి సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా మత్స్యకారులంతా వేటకు వెళ్లే బోట్లను తీర ప్రాంతానికి తీసుకొచ్చి భద్రపరుచుకోవాలన్నారు. మత్స్యకారులకు రక్షణ కల్పించేందుకు తుపాను రక్షిత ప్రాంతాలను కూడా సిద్ధం చేశామన్నారు. తుఫాను హెచ్చరికలు వాతావరణ కేంద్రం సూచించిన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. మత్స్యకారులు ఎవరూ ఈ సమయంలో వేటకు వేళ్లకూడదని హెచ్చరించారు. గ్రామాల్లోని సాగర మిత్రాల ద్వారా సమాచారం కాల్ సెంటర్లకు చేరవేయడం ద్వారా సత్వరమే సహాయక చర్యలు అందించడానికి వీలుపడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.