కోవిడ్ నియంత్రణలో వైద్యులు, అధికారులు పగలూరాత్రి సేవలు అందిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశంసించారు. సోమవారం మంత్రి భీమిలి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కరోనా నియంత్రణకు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. కరోనా పాజిటివ్ బారిన పడిన వారు హోమ్ ఐసోలేషన్ లో లేకుండా బక్కనపాలెంలో 800 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లో చేరవచ్చునని, INS కళింగ, భీమిలి ప్రభుత్వ హాస్పిటల్, పద్మనాభం కేంద్రీయ విద్యాలయాల్లో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందవద్దని హోమ్ ఐసోలేషన్ చికిత్స పొందుతున్న వారు పూర్తిగా నయమయ్యేంత వరకు అక్కడే వుండొచ్చన్నారు. మంత్రి ముందుగా అధికారులను ప్రస్తుత కరోనా పరిస్థితిని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పి.హెచ్.సి. డాక్టర్లు, సచివాలయ సిబ్బందితో విడివిడిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు భీమిలి హాస్పిటల్లో వ్యాక్సిన్ ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, మార్కెట్లో సామాజిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని భీమిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. భీమిలి లో నాలుగు వార్డుల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్ జరగాలని భీమిలి జోనల్ కమిషనర్ ని ఆదేశించారు. త్వరలో ప్రతి వార్డులో పర్యటిస్తానని తెలిపారు. యాష్ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రెవెన్యూ పోలీసు అధికారులు మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె.పెంచల కిషోర్, భీమిలి ఎంపిడీవో, జోనల్ కమిషనర్, భీమిలి నియోజకవర్గ ఇంచార్జి ముత్తంశెట్టి మహేష్, ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.