విజయనగరం జిల్లాలో 45 ఏళ్లు దాటిన వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విలేకర్లకు మంగళ, బుధవారాల్లో కోవిడ్ టీకా మొదటి డోసు వేయనున్నారు. దీనికోసం జిల్లాలో మూడు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో, పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో, బొబ్బిలి కళాభారతి ఆడిటోరియం వద్ద ఈ వేక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. వీరందరికీ కోవిషీల్డు టీకా మాత్రమే మొదటి డోసుగా వేయనున్నారు. వేక్సిన్‌కు వచ్చే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తమ గుర్తింపుకార్డును తీసుకురావాల్సి ఉంటుంది. కేవలం ఉద్యోగులకు మాత్రమే వేక్సిన్ వేస్తామని, వారి కుటుంబ సభ్యులకు వేక్సిన్ వేయడం జరగదని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.
వేక్సిన్ కు అనుమతించే ప్రభుత్వ ఉద్యోగులు ః
వ్యవసాయశాఖ, పశు సంవర్థక, బ్యాంకులు, పౌర సరఫరాలు, రేషన్ డీలర్లు, డెయిరీ, దేవాదాయశాఖ, మత్స్యశాఖ, విద్యుత్, ఫుడ్ కార్పొరేషన్, ఉన్నత, ప్రాధమిక విద్యాశాఖల సిబ్బంది, ప్రభుత్వ, ప్రయివేటు ఉపాధ్యాయులు, సమాచార, పౌర సంబంధాల శాఖ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, పరిశ్రమల శాఖ, మార్కెటింగ్ శాఖ, రైతుబజార్ సిబ్బంది మరియు వ్యాపారులు, మార్కెట్ కమిటీ సిబ్బంది మరియు హమాలీలు, మైనారిటీ సంక్షేమశాఖ, పోర్టులు, పోస్టల్, రైల్వే, గ్రామీణాభివృద్ది శాఖ, ఉపాధిహామీ సిబ్బంది, నైపుణ్య శిక్షణా శాఖ, పర్యాటక శాఖ, రవాణా, ఆర్‌టిసి, గిరిజన సంక్షేమశాఖ తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన 45 ఏళ్లు పైబడిన వారు తమ ఐడి కార్డును తీసుకువెళ్లి వేక్సిన్ వేయించుకోవచ్చు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయివేటు వ్యక్తులకు వేక్సిన్ ః
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొన్ని వర్గాలకు చెందిన, 45 ఏళ్లు దాటిన ప్రయివేటు వ్యక్తులకు కూడా మంగళ, బుధవారాల్లో కోవిషీల్డు మొదటి డోసు వేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో కార్పొరేషన్ వేక్సినేషన్ శిబిరాన్ని. వీరు కూడా తమ గుర్తింపు కార్డును చూపించి వేక్సిన్ వేయించుకోవచ్చు.
వేక్సిన్ కు అనుమతింపబడే ప్రయివేటు వ్యక్తులు ః
న్యూస్ పేపర్ విక్రయదారులు, డోర్ డెలివరీ ఏజెంట్లు, షాపింగ్ మాల్స్ యాజమాన్యం, సిబ్బంది, మెడికల్ షాపు యజమానులు, వర్కర్లు, హొటళ్లు, రెస్టారెంట్ల సిబ్బంది, ఫంక్షన్ హాళ్ల యజమానులు, సిబ్బంది, ప్రయివేటు బస్సు ఆపరేటర్లు, డ్రైవర్లు, టేక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు.