యాస్ తుఫాను పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. గత నాలుగురోజులుగా అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోంది. సోమ వారం తుఫాను ప్రభావం అధికంగా ఉండే ఇచ్చాపురం మండలం డొంకూరు, కవిటి మండలం ఇద్దివానిపేట తదితర గ్రామాల్లో జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ పర్యటించారు. పరిస్ధితులను పూర్తి స్ధాయిలో పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి యాస్ తుఫాను మంగళ వారం నాటికి అతి తీవ్ర రూపం దాల్చనుందని, 26వ తేదీన పారదీప్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వివరించారు. తుఫాను ప్రభావం ఇచ్చాపురం నుండి సంతబొమ్మాలి మండలాల వరకు అధికంగా ఉండనుందని పేర్కొంటూ సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్న డొంకూరు, ఇద్దివానిపాలెం వంటి గ్రామాలపై మరింత ఎక్కువ ప్రభావం ఉండనుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు గ్రామస్తులు తరలివెళ్ళాలని స్పష్టం చేసారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగరాదని కావున ముందుగానే సురక్షిత కేంద్రాలకు వెళ్ళాలని అన్నారు. పశువులను కూడా సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహార సౌకర్యాలు కల్పిస్తున్నామని, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు, ముసలి వారికి అవసరమైన ఆహారం, మందులు సిద్ధం చేసామని చెప్పారు. సోమ వారం సాయంత్రం నుండి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఫైలిన్, హుద్ హుద్, తితిలి వంటి తుఫాను ప్రభావాలను చవి చూసిన మీదట ఎటువంటి అజాగ్రత్త చర్యలు ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, డిప్యూటి సూపరింటిండెంట్ ఆప్ పోలీస్ శివరామ రెడ్డి, మండల అధికారులు పాల్గొన్నారు.