ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసేందుకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటుచేసి, ఈ వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశమందిరంలో జాయింట్ కలెక్టర్ జిల్లాలో 2020-21 రబీ ధాన్యం సేకరణపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దళారులు, కమిషన్ ఏజెంట్లు వదంతులను వ్యాప్తిచెందిస్తూ రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని, రైతులు ఇలాంటి వాటిని నమ్మవద్దన్నారు. ముఖ్యంగా బోండాలు (ఎంటీయూ 3626) రకం పండించిన రైతులు ఆందోళనతో ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దని, ఏవైనా సందేహాలుంటే వెంటనే రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బోండాలు రకం ధాన్యాన్ని పండించడం జరిగిందని, సగటు నాణ్యతకే మద్దతు ధర లభిస్తుందని స్పష్టం చేశారు. క్వింటాకు రూ.1,868; 75 కేజీలకు రూ.1,401 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని జేసీ వెల్లడించారు.
ప్రస్తుతం జిల్లాలో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని.. వీటిని 865 రైతు భరోసా కేంద్రాలు, 400 రైస్ మిల్లులతో అనుసంధానించినట్లు జేసీ తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు సహాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని, రైతులు వీరిని సంప్రదిస్తే చాలు.. వెంటనే ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటారని వివరించారు. క్రాప్‌బుక్‌లో నమోదైన ఖాతాకు పది రోజుల్లోనే ధాన్యం సొమ్ము జమవుతుందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే జిల్లాస్థాయి కమాండ్ కంట్రోల్ రూం నెంబరు 88866 13611కు ఫోన్‌చేసి, నివృత్తి చేసుకోవాలని రైతులకు సూచించారు. ఇప్పటివరకు ఈ కంట్రోల్‌రూం ద్వారా 314 మందికి మార్గనిర్దేశనం లభించిందని, వారినుంచి సజావుగా ధాన్యం కొనుగోలు జరిగినట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో సివిల్‌సప్లయ్స్ జిల్లా మేనేజర్ ఇ.లక్ష్మీరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజయ్‌కుమార్, డీఎస్‌వో పి.ప్రసాదరావు పాల్గొన్నారు.