23362 మంది రైతులకు డా.వైఎస్సార్ భీమా..


Ens Balu
3
Vizianagaram
2021-05-25 13:25:40

డా. వై.ఎస్.ఆర్. పంటల బీమా పధకం క్రింద జిల్లాలోని  23 వేల 362  మంది  రైతులకు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.    ఖరీఫ్ 2020 కు గాను 32.49 కోట్ల రూపాయలు  రైతుల ఖాతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే  నేరుగా  జమ  చేయడం జరిగిందన్నారు. మంగళవారం   ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  వీడియో  కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా  రైత్జులకు పంటల బీమా పధకం పరిహారాన్ని వారి ఖాతాలలో జమ చేశారు.  ఈ కార్యక్రమానికి విజయనగరం  నుండి కలెక్టర్ తో పాటు  బొబ్బిలి శాసన సభ్యులు  శంబంగి వెంకట  చిన్న అప్పల నాయుడు  సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్,  వ్యవసాయ శాఖ సంయుక్త   సంచాలకులు  ఆషా దేవి పాల్గొన్నారు.  వీడియొ కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాకు చెందిన రైతులకు చెక్కును అందజేశారు.
        అనంతరం మీడియా తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లాలో 2020 ఖరీఫ్ కు సంబంధించి  ఎక్కువగా  వరి, వేరు శెనగ, అరటి  పంటలకు పంటల బీమా పధకం క్రింద  పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. సహాయం సకాలం లో అందితేనే  రైతుకు ఉపయోగంగా ఉంటుందని భావించి  రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల కోసం ప్రకటించిన అన్ని  పధకాలతో  ఒక కాలెండర్ ను  రూపొందించి, ప్రకటించిన తేదీలలోనే వారికి లబ్ధి చేకూర్చుతున్నారని పేర్కొన్నారు.  పధకాలన్ని పారదర్శకంగా అందించడం జరుగుతోందని, రైతు భరోసా కేంద్రాల్లో  సామాజిక తనిఖీ కోసం లబ్ధి దారుల జాబితాలను ప్రదర్శించడం జరుగుతోందన్నారు. కరోనా వంటి కష్ట కాలం లో ఈ ఆర్ధిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని  తెలిపారు.
సిఫార్సు