వై.యస్.ఆర్. పంటల భీమా పథకం ద్వారా జిల్లాలో 14,652 మంది రైతులు లబ్దిపొందుతున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు భీమా పరిహారం అందించడంలో భాగంగా "వైఎస్సార్ ఉచిత పంటల భీమా" పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నర్సీపట్నం శాసన సభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్,జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పాల్గొని రూ.8.54 కోట్ల రూపాయల చెక్కును రైతులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద 15.15 లక్షల రైతుల పంటల ఉచిత భీమా పథకంను రైతుల ఖాతాల్లో రూ.1820.23 కోట్లు ఆయన జమ చేసినట్లు పేర్కొన్నారు. 2 సంవత్సరాలలో రాష్ట్రంలో రైతులకు 83 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇచ్చిన హామీలన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అనుకున్న సమయానికి పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ఇన్ చార్జ్ జె.డి. మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.