బంగాళాఖాతంలో యాస్ తుఫాన్ ను ఎదుర్కొనుటకు సర్వ సన్నద్దతతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లతో యాస్ తుఫాన్ ను ఎదుర్కొనుటకు సంసిధ్దతపై ఆయన వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాస్ తుఫాన్ మూలంగా మూడు జిల్లాల్లో కోవిడ్ పేషెంట్లకు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఆక్సిజన్ తయారీ, నిల్వలపై ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. గాలులు వలన విద్యుత్ అంతరాయం ఏర్పడితే కోవిడ్ పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తీవ్రమైన గాలులకు చెట్లు రోడ్లపై విరిగిపడితే రవాణాకు, ఆంబులెన్స్ లకు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ యాస్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో కోవిడ్ పేషెంట్లకు ఏ విధమైన ఇబ్బంది కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. స్టీల్ ప్లాంట్, తదితర కంపెనీల్లో ఆక్సిజన్ తయారీ, గ్యాస్ ఫిల్లింగ్, రీఫిల్లింగ్, ఆక్సిజన్ నిల్వలపై ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ సేవలు అందించడం జరుగుతోందని, విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పారు. రెవెన్యూ, పంచాయితీ రాజ్ శాఖలు సిద్దంగా ఉన్నాయన్నారు. రవాణాకు, ఆంబులెన్స్ లకు అంతరాయం లేకుండా రోడ్లపై చెట్లు విరిగిపడితే తక్షణమే తొలగించేందుకు సిబ్బందిని సిద్దం చేసుకోవడమైనదని, ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్.ఎఫ్., కోస్ట్ గార్డు లను సిద్దం చేసుకున్నట్లు వివరించారు. ఐ.ఎం.డి. రిపపోర్టును ఎప్పటికప్పుడు తెలియజేయనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.