నైరుతి రుతుపవన కాలంలో ఎదురైయ్యే తుఫానులు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పటిష్టమైన విపత్తు నియంత్రణ ప్రణాళికలతో సంసిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి జిల్లా, డివిజన్, మండల అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజాస్టర్ మిటిగేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జూన్ నుండి సెప్టెంబరు వరకూ నైరుతి రుతుపవన కాలంలలో తరచుగా తుఫానులు, వరదలు వంటి విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. కాకినాడ, అమలాపురం, పెద్దపురం డివిజన్ల పరిధిలోని 13 తీర మండలాలు తుఫానుల వల్ల ప్రభావితమౌతుండగా, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లోని 27 మండలాలు వరదల తాకిడికి గురైతున్నాయన్నారు. గత అనుభవాలను పరిగణలోకి గైకొంటూ తుఫానులు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ శాఖల ద్వారా చేపట్టవలసిన విధివిధానాలతో ప్రమాణిక విపత్తు నియంత్రణ ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, ఈ ప్రణాళికల ప్రకారం అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తుఫాను, వరద ప్రభావానికి లోనైయ్యే అన్ని మండలాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలన్నిటినీ సక్రమంగా పనిచేసేలా చూడాలని, విపత్తు నివారణ, నియంత్రణకు అవసరమైన సామాగ్రి నిల్వలను ఫ్లడ్ స్టోర్ లలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. విపత్తు హెచ్చరిక వెలువడిన వెంటనే నియంత్రణ అధికారులు అందరూ తమతమ మండల ప్రధాన కార్యస్థానాలకు చేరుకుని, సహాయ, పునరావాస యంత్రాగాన్ని సంసిద్ధ పరచాలన్నారు. విపత్తు తాకిడి మండలాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కోవిడ్ రోగులకు ఆరోగ్య సేవలందిస్తున్న కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, విలేజి ఐసోలేషన్ సెంటర్లు ఇతర వ్యవస్థలకు విఘాతం కలుగకుండా అవసరమైన చర్యలుచేపట్టాలని, అవసరమైతే ముందే సురక్షిత ప్రాంతానికి తరలించాలని సబ్ కలెక్టర్లు, ఆర్డిఓలను ఆదేశించారు. అలాగే ఈ కేంద్రాలన్నిటిలో జనరేటర్లు విధిగా ఉండేలా చూడాలన్నారు. అవసరమైన మందుల నిల్వలను వైద్యఆరోగ్య అధికారులు, ఆహార, నిత్యావసర సరుకుల నిల్వలను పౌర సరఫరా అధికారులు విపత్తు తాకిడ్ మండలాల్లో తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సహాయక చర్యల కొరకు లైసెన్స్డు బోట్లును పోర్టు, మత్స్య, టూరిజం శాఖల అధికారులు గుర్తించి ఉంచాలన్నారు. రహదారుల పునరుద్దరణకు అవసరమైన జెసిబిలు, పవర్ రంపాలను ఆర్ అండి బి అధికారులు, విద్యుత్ సరఫరా పునరుద్దరణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రిని ట్రాన్స్ అధికారులు సిద్దం చేయాలని తెలిపారు. ప్రభావిత ప్రాంతాలలో త్రాగునీటి సమస్య రాకుండా ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు తగు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు, వరద ముంపుల గురించి రైతులను సకాలంలో అప్రమత్తం చేసి, పంటలను కాపాడుకునే విధానాలపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. తుఫానుల గురించి మత్య్సకారులను హెచ్చరించి, సురక్షితంగా తీరానికి చేరుకునేలా మత్య్సశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద కట్టలను నిశితంగా తనిఖీ చేసి బలహీనమైన గట్లను పటిష్టపరచాలని, వరద జల మట్టాల సమాచారాన్ని ఎప్పటికప్పడు రక్షణ, సహాయ యంత్రాంగానికి తెలియజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రభలకుండా మున్సిపల్ కమీషనర్లు, పంచాయితీ అధికారులు పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమాచార వ్యవస్థకు అంతరాయం కలుగకుండా సెల్ టవర్ల వద్ద జనరేటర్లు, ఆయిల్ నిల్వలు ఉంచాలని వివిద సెల్యూలర్ కంపెనీల ఆపరేటర్లను ఆదేశించారు.
తూర్పు మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను ప్రభావం జిల్లా పై అంతగా లేదని, అయినప్పటికి అప్రమత్తతను సడలించకుండా హై ఎలర్ట్ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మీశ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఐటిడిఏల పిఓలు, సబ్ కలెక్టర్లు, ఆర్డిఓలు, తహశిల్దారులు తదితరులు పాల్గొన్నారు.