తాడిపత్రి అర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేస్తున్న 500 పడకల తాత్కాలిక ఆసుపత్రిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం పచ్చదనంతో నిండిపోవాలన్నారు. మంగళవారం సాయంత్రం తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఆసుపత్రిలో స్వచ్ఛ వాతావరణం కనిపించాలన్నారు. వేస్ట్ మ్యానేజ్ మెంట్ పకడ్బందీగా నిర్వహించాలని, 500 పడకల ఆసుపత్రి నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని నియమించుకోవాలని తాడిపత్రి మునిసిపల్ కమిషనర్ ను అదేశించారు. ఆసుపత్రిలో వాహనం అనేది కనిపించకూడదన్నారు. వాహనాల పార్కింగ్ పూర్తిగా ఆసుపత్రి అవరణం బయటే ఉండాలన్నారు. సహాయకుల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. సహాయకుల కోసం ప్రత్యేక భోజన శాల, వెయిటింగ్ హాల్ ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రిలో సహాయకులను నియంత్రించేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని పోలీసు శాఖను అదేశించారు. సహాయకుల కోసం రిజిస్టర్ నిర్వహించుకుని బాధితుల వద్ద గడిపే సమయాన్ని నియంత్రించాలన్నారు.
పూర్తయిన సర్జ్ ట్యాంకు నిర్మాణం
అర్జాస్ స్టీల్స్ వారు పూర్తి చేసిన సర్జ్ ట్యాంకును కలెక్టర్ పరిశీలించారు. సర్జ్ ట్యాంక్ వరకూ అనుకున్న సమయానికి ఆక్సిజన్ సరఫరా చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సర్జ్ ట్యాంకు నుంచి పడకలకు ఆక్సిజన్ సప్లై చేయడానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఏపీఎమ్ఎస్ ఐడీసీ ఈఈ ని ఆదేశించారు. కోవిడ్ బాధితులకు వైద్య అందించేందుకు అవసరమైన సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, మందులను సిద్ధం చేసి ఉంచామని డీఎంహెచ్వో తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆసుపత్రి పర్యవేక్షణలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ తదితరులు పాల్గొన్నారు.
సాగర్ సిమెంట్స్ రూ.5 లక్షలు విరాళం
జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలకు తమవంతు సహాయంగా సాగర్ సిమెంట్స్ రూ.ఐదు లక్షల విరాళం ప్రకటించింది. తాత్కాలిక ఆసుపత్రి ప్రాంగణంలోనే సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఈపీ రంగా రెడ్డి, హెచ్ ఆర్ శ్రీమన్నారాయణలు ఐదు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టరుకు అందజేశారు. గతంలో కోవిడ్ పై పోరాటంలో భాగంగా సీఎం రిలీఫ్ ఫండుకు రూ.25 లక్షల రూపాయలు, పోలీసు శాఖకు రూ.2 లక్షల రూపాయల విలువైన పీపీఈ కిట్లను అందజేయడమే గాక తాజాగా ఐదు లక్షల రూపాయల విరాళం అందించిన సాగర్ సిమెంట్స్ మేనేజ్ మెంటును కలెక్టర్ అభినందించారు.