ఒకవైపు జిల్లాలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోవిడ్ ప్రభావిత కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన, తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకు ముందే మరణించి, ఇప్పుడు కోవిడ్ తో మరొకరు మరణించడం వల్ల అనాథలైన చిన్నారుల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే కార్యకమాన్ని కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి ప్రారంభించారు. కాకినాడ గ్రామీణ మండలం, తిమ్మాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల చిన్నారితోపాటు రాజమహేంద్రవరానికి చెందిన, ప్రస్తుతం గోకవరంలో సంరక్షుల వద్ద ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారుల సంరక్షకులకు డిపాజిట్‌కు సంబంధించిన పత్రాలను కలెక్టర్ అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ విపత్తు కారణంగా అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను గౌరవ ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారని, ఈ మేరకు జిల్లాలో అర్హులను గుర్తించి, వారికి లబ్ధిచేకూర్చుతున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కోవిడ్ నియంత్రణ, నివారణతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విలేజ్ ఐసోలేషన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ) అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా కోవిడ్, బ్లాక్‌ఫంగస్ బాధితులకు వైద్యం అందించేలా చూస్తున్నామన్నారు. ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ దురదృష్టవశాత్తు కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ మరణించిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇది అత్యంత విచారకరమన్నారు. ఈ కుటుంబాల బాధిత చిన్నారులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని అమలుచేస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పరిహారానికి అర్హులైన వారి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు డిపాజిట్ చేసి, బాండ్‌ను వారికి అందించనున్నట్లు తెలిపారు. చిన్నారులకు 25 ఏళ్లు నిండాక ఈ సొమ్ము తీసుకునేందుకు వీలుంటుందని, అప్పటివరకు ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ మొత్తాన్ని నెలవారీగానీ, మూడు నెలలకోసారి గానీ తీసుకోవచ్చని వివరించారు. వడ్డీ ద్వారా వచ్చే సొమ్ము చిన్నారుల చదువుకు, ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. చిన్నారుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్నారులకు అధిక వడ్డీ వెళ్లేలా బ్యాంకర్లకు కూడా విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఇలాంటి చిన్నారులు ఇంకా ఎవరైనా ఉంటే మీడియాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఐసీడీఎస్ అధికారులకు తెలియజేయాలన్నారు. గ్రామ స్థాయిలో కోవిడ్ కట్టడి కమిటీలకు నేతృత్వం వహిస్తున్న సర్పంచ్‌లు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి శరణ్యతో కలెక్టర్ మాట్లాడుతూ బాగా చదువుకొని, డాక్టర్ కావాలని మార్గనిర్దేశనం చేశారు. కాకినాడ ఆర్ఎంసీలో వైద్య విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో నీకు ఎదురైన కష్టం ఇంకెవరికీ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా డాక్టర్ కావాలని చిన్నారి భవిష్యత్‌కు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జేసీ (ఆర్) డా. జి. లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఐసీడీస్ పీడీ జీవీ సత్యవాణి, డీఎంహెచ్‌వో ఎన్. ప్రసన్నకుమార్, డీసీపీవో వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హతలు:
- దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి 18 ఏళ్ల లోపు వయసుండాలి.
- కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన వారి పిల్లలు.
- తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకు ముందే మరణించి, ఇప్పుడు కోవిడ్‌తో మరొకరు మరణించిన వారి పిల్లలు.
- కుటుంబ ఆదాయం దారిద్ర్యరేఖకు దిగువన ఉండాలి.
- కోవిడ్ పాజిటివ్ రిపోర్టును సమర్పించాలి.
- ఇతర బీమా సంస్థల నుంచి లబ్ధిపొందని వారు అర్హులు.
- జిల్లాకు సంబంధించి చిన్నారుల వివరాలను టోల్‌ఫ్రీ నెంబరు 1098కు కాల్‌చేసి, అందించవచ్చు.