ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు..
Ens Balu
2
Kakinada
2021-05-26 13:51:44
కోవిడ్ ను ఎదుర్కోవడానికి వైద్యఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, వ్యవసాయం తదితర శాఖల అధికారులతో కలిసి సీఎం వైఎస్ జగన్ బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో స్పందన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జేసీ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (సంక్షేమం) జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితి, వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య, ఇతర సేవలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వివిధ జిల్లాలకు చెందిన వైద్య నిపుణులు, నర్సు, ఎంఎన్‌వోలతో వర్చువల్‌గా మాట్లాడారు. కోవిడ్ విపత్తు సమయంలో ప్రాణాలను పణంగాపెట్టి సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి శాల్యూట్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫీజులు, ఆరోగ్యశ్రీ సేవలు తదితరాలపై నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుపత్రులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 104 కాల్‌సెంటర్ వ్యవస్థ చాలా కీలకమైందని, ఈ వ్యవస్థ ద్వారా బాధితులకు సరైన సమయంలో సేవలందేలా చూడాలన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల స్థలాల లేఅవుట్లలో సౌకర్యాల కల్పన; గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు తదితరాల నిర్మాణాలు; ఖరీఫ్-2021 సన్నద్ధతపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం జూన్‌లో జగనన్న తోడు, వైఎస్సార్ వాహనమిత్ర, వైఎస్సార్ చేయూత కార్యక్రమాలు జరగనున్నాయని, వీటికోసం లబ్ధిదారుల ఎంపిక, సోషల్ ఆడిట్ వంటి ప్రక్రియలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.