విజయనగరంజిల్లాలో ఈ నెల 30న బోధనాసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. విజయనగరంతో సహా రాష్ట్రంలోని మొత్తం 16 బోధనాసుపత్రుల నిర్మాణ పనులను ఆరోజు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రకటించారు. ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కోవిడ్ నియంత్రణ, గ్రామీణ ఉపాధిహామీ, గృహనిర్మాణం, ఖరీఫ్‌కు, జగనన్న తోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర తదితర పథకాలపై సమీక్షించారు. రాష్ట్రంలోని మూడు జిల్లాలు మినహా, మిగిలిన ప్రాంతంలో కోవిడ్ తగ్గుముఖం పట్టిందని, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గణాంకాలతో సహా వివరించారు. ఆసుపత్రిలో ఎంఎన్ఓల నుంచి జిల్లా కలెక్టర్ల వరకూ ప్రతీఒక్కరూ కోవిడ్ కట్టడిలో భాగస్వాములు అయ్యారని అభినందించారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మందులు, ఇంజక్షన్లు, ఆక్సీజన్‌కు ఎక్కడా కొరత రాకుండా చేశామని అన్నారు. ఆసుపత్రుల్లో చేరిన కోవిడ్ రోగుల్లో సుమారు 78శాతం మందికి ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం క్రింద వైద్యం అందించినట్లు తెలిపారు. ఆక్సీజన్ వృధా కాకుండా, వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులను వేగవంతం చేయాలని, జూన్‌లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల పనులను పూర్తిచేసి, జులై 8 రైతు దినోత్సవం నాటికి సిద్దం చేయాలని అన్నారు. విత్తనం పంపిణీ నుంచి పంట కొనుగోలు వరకూ, రైతుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ రైతు భరోసా కేంద్రాల ద్వారానే జరగాలని సూచించారు. రైతు సంతోషమే మనందరి ధ్యేయం కావాలని అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 16 బోధనాసుపత్రుల పనులను ఈ నెల 30న ప్రారంభిస్తామని, ఏ జిల్లాలోనైనా భూసేకరణ పెండింగ్ ఉంటే, ఆ లోగా పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. పేదలకు గృహనిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పారు. ఈ నెలాఖరు లోగా అన్ని లేఅవుట్లలో నీరు, విద్యుత్ సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేశారు. లబ్దిదారుల రిజిష్ట్రేషన్లను కూడా తక్షణమే పూర్తి చేయాలన్నారు. 90 రోజుల పథకం క్రింద కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి కూడా, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుకను స్టాకు పెట్టుకోవాలని సూచించారు. ఎంఐజి పథకానికి రాష్ట్రంలో 3లక్షలకు పైగా మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, వారికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికి వీలుగా, స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. ప్రస్తుత లాక్‌డౌన్, కర్ఫ్యూలను దృష్టిలో పెట్టుకొని, బ్యాంకర్లే రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి, రైతుకు పంట రుణాలు ఇచ్చేవిధంగా కలెక్టర్లు కృషి చేయాలని సిఎం కోరారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.