కరోనా నియంత్రణలో గ్రామ కమిటీలే కీలకం..


Ens Balu
3
Addanki
2021-05-26 14:19:32

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేలా విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  పోల భాస్కర్ సూచించారు. కోవిడ్ మేనేజ్మెంట్ పై బుధవారం సాయంత్రం దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లోని మండలస్థాయి అధికారులకు దర్శిలోని పీజీఎన్ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ నివారణ కోసం ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు అనుమానిత లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడడం అత్యంత కీలకమన్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికే పంచాయతీ స్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో విలేజ్ కోవిడ్ మేనేగ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి నోడల్ ఆఫీసరుగా ఉంటారని, వార్డు సభ్యులు, వాలంటీర్లు, వీవోఏ ప్రతినిధి, ఇతర సంఘాల నుంచి ప్రతినిధులు సభ్యులుగా ఉండేలా మార్గదర్శకాలు ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు తహసీల్దార్, ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, ఎమ్.ఈ.వో, ఐసీడీసీ నుంచి సీడీపీవో లతో 
మండల స్థాయిలో 'కోవిడ్ వార్ రూము'లను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మండలాన్ని క్లస్టర్లుగా విభజించుకుని వార్ రూము సభ్యులు బాధ్యత తీసుకుని విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు కోవిడ్ కట్టడి చర్యలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామస్థాయిలోని కమిటీల పనితీరును మండలస్థాయి కమిటీ పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. 
              గ్రామస్థాయిలో కోవిడ్ అనుమానితుల  క్వారంటైన్, బాధితుల ఐసోలేషన్ పై విలేజ్ కమిటీలు దృష్టి పెట్టాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. హోమ్ ఐసోలేషన్ కు అవకాశం లేనివారి కోసం  కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ కేసులను ముందుగానే గుర్తిస్తే పరిస్థితిని బట్టి మెరుగైన చికిత్స అందించడం ద్వారా త్వరగా పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో కమ్యూనిటీని భాగస్వామిని చేయడం ద్వారానే కోవిడ్ ను సమర్ధవంతంగా కట్టడి చేయగలమన్నారు. ఈ దిశగా కమ్యూనిటీని సన్నద్ధత చేయాలన్నారు. 
             ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కైలాష్ గిరీశ్వర్, ఎస్.సీ. కార్పొరేషన్ ఈ.డీ. శ్రీనివాస్ విశ్వనాథ్, ఐ.సీ.డీ.ఎస్. పీడీ లక్ష్మీదేవి, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎం.ఈ.వో.లు, ఐ.సీ.డీ.ఎస్. సీడీపీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
సిఫార్సు