ఈ కోవిడ్ లో పెద్ద మనసుతో పనిచేయాలి..
Ens Balu
1
Srikakulam
2021-05-26 15:18:22
కోవిడ్ సమయంలో అధికారులు, వైద్యులు, సిబ్బంది పెద్ద మనసుతో పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ ప్రత్యేకమైన సమయమని, ప్రతి ఒక్కరు గమనించి పెద్ద మనసుతో పనిచేయాలని విజ్ఞప్తి చేసారు. కోవిడ్ బాధితులకు మంచి వైద్య సేవలు అందాలని, ఎక్కడా పర్యవేక్షణ లోపం ఉండరాదని ఆయన అన్నారు. కర్ఫ్యూ సక్రమంగా అమలు కావాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 23.69 లక్షల మందికి రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి అయిందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఉపాధి హామీ క్రింద కనీసం కోటి పని దినాలు కల్పించాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగరాదని ఆయన స్పష్టం చేసారు. ఈ నెల 30న 16 బోధన ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. గృహ పట్టాలు పంపిణీ చేయాల్సిన వారికి వెంటనే పంపిణీ చేయాలని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు ప్రతి అంశంలో సహాయకారిగా ఉండాలన్నారు. రైతు సంతోషంగా ఉంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుందని సూచనగా ఉంటుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కుర్మారావు, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, పంచాయతీ రాజ్ ఎస్ఇ భాస్కరరావు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.