అంతర్జాతీయ ప్రమాణాలతో ముడసర్లోవ పార్కు అభివృద్ధి..
Ens Balu
3
Mudasarlova park
2021-05-26 15:32:00
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ముడసర్లోవ నాచురల్ పార్కును ఓ సుందర నందనవనంగా రూపొందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఈ మహా విశాఖ నగరంలో మరో పర్యాటక మణిహారంగా తీర్చిదిద్దేందుకు దేశ విదేశాల్లో ఉన్న పార్కుల నమూనాల్ని పరిశీలించాలని సూచించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో జలాశయం, మరో 80ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పరచుకున్న ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పార్కుగా అభివృద్ధి చేసేలా ప్లాన్లు తయారు చేయాలనీ, దీనికి సంబంధించిన నిధుల గురుంచి ఆలోచించకుండా, అద్భుతమైన పార్కుగా మార్చేందుకు ప్రయత్నించాలన్నారు. పిపిపి పద్దతిలో గాని, కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిద్దామని విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. గతంలో విఎంఆర్ డిఎ ముడసర్లోవ పార్కు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలున్నాయని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, విఎంఆర్ డిఎ కమిషనర్ కోటేశ్వరరావు విజయసాయి రెడ్డికి వివరించారు. మీనియేచర్ ఎ.పి. అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్, విఎంఆర్ డిఎ, జివిఎంసి సంయుక్తంగా ప్రాజెక్టుపై దృష్టి సారించాలని విజయసాయి రెడ్డి సూచించారు. దాదాపు 40శాతం వరకూ ఉన్న పచ్చని భారీ వృక్షాలని తొలగించకుండా, ఆకర్షణీయమైన ప్రాజెక్టు రూపొందించేందుకు ప్రయత్నించాలని విజయసాయి రెడ్డి ఆదేశించారు. నగరప్రజలకు ఆహ్ల్లాదకరమైన, ఆనందదాయకమైన వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలన్నారు. మీనియేచర్ విలేజ్, జంగిల్ బుక్ ట్రీ, ఫ్యామిలీ ప్లే ఏరియా, వాటర్ స్పోర్ట్స్ హబ్ మొదలైనవి ఉండేలా ప్లాన్స్ రూపొందించాలన్నారు. అదేవిధంగా, సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించిన రూట్ మ్యాప్ ని విజయసాయి రెడ్డి పరిశీలించారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలిత్తకుండా, సంబంధిత రూట్ ని ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని సింహాచలం ఇ.ఒ. సూర్యకళ, జివిఎంసి, విఎంఆర్ డిఎ కమిషనర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి డా. జి. సృజన, విఎంఆర్ డిఎ కమిషనర్ కోటేశ్వరరావు, జాయింటు కలక్టరు వేణుగోపాల రెడ్డి, ఎ.పి. అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ జోనల్ మేనేజర్ మంగ, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, సిసిపి విద్యుల్లత, ఎడిహెచ్ ఎం.దామోదర రావు, ఎస్.ఇ. గణేష్ బాబు, డిసిపి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.