శ్రీకాకుళం జిల్లాలో గురువారం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం సాయంత్రం మండల అధికారులు, వైద్యులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గురువారం 30 వేల మందికి కోవిడ్ టీకా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి టీకా వేయడం జరుగుతుందని అందులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పారు. అనంతరం 45 సంవత్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 170 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతంలో 25 సచివాలయాల పరిధిలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రోజుకు 150 మందికి మాత్రమే నిర్దేశిత ప్రదేశంలో టీకా కార్యక్రమం జరుగుతుందని వారికి ముందుగా సమాచారం అందించాలని ఎంపీడీవో లను ఆదేశించారు. ఏ ప్రదేశంలో జరుగుతుందో సమాచారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. టీకాకు వచ్చిన వారిని నిర్దేశించిన స్థలాల్లో కూర్చోబెట్టి సజావుగా టీకా వేయాలని ఎక్కడ రద్దీ జరగడానికి వీల్లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ పి హెచ్ సి వైద్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నదని, వైద్యులు తమ సిబ్బందిని నియమించాలని అన్నారు. ప్రతి మండలంలో 4 సచివాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని, 15 మండలాల్లో మాత్రం 5 సచివాలయాల పరిధిలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. టీకా కార్యక్రమం ఉదయం 8 గంటలజూ ప్రారంభం అవుతుందని చెప్పారు.