హిందూపురం జిల్లా ఆసుపత్రి ఆవరణంలో నిర్మించిన 1000 ఎల్పీఎం ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా ఆసుపత్రిలో నిర్మించిన ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా హిందూపురం జిల్లా ఆసుపత్రి ఆవరణంలో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటును నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నియోజక వర్గ ప్రజాప్రతినిధుల సహకారంతో హిందూపురం జిల్లా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఒక ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం పని చేసే ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యున్నత సేవలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రతి పేదవాడికి ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. నాడు-నేడు ద్వారా విద్యాలయాలు, ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పన చేస్తోందన్నారు. కరోనా విపత్కాలంలో కోవిడ్ కేర్ సెంటర్లలో భోజన వసతులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం కూడా అందిస్తోందన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో యాభై శాతం పేద ప్రజలకు పడకలు కేటాయిస్తున్నామన్నారు.