దేశంలోనే ఆసుపత్రి ఆవరణంలో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు కలిగిన మొట్టమొదటి ఆస్పత్రిగా హిందూ పురం జిల్లా ఆసుపత్రి రికార్డు సొంతం చేసుకుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం హిందూపురం జిల్లా ఆసుపత్రిలో 1000 ఎల్పీఎం(లీటర్ పర్ మినిట్) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఎన్.హెచ్.ఏ.ఐ, డీఆర్డీవో సంయుక్త సహకారంతో ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు నిర్మాణాన్ని అతితక్కువ సమయంలో నిర్మించి ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు. ఈ జెనరేషన్ ప్లాంటు ద్వారా రోజుకు 100 పడకలకు నిరంతరం ఆక్సిజన్ అందించే అవకాశం ఉందన్నారు. జెనరేషన్ ప్లాంటు నిర్వహణకు 125 కెవి సబ్ స్టేషన్ ద్వారా నిరంతర విద్యుత్ అందించనున్నామన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అందించిన రూ. 20 లక్షల నిధులతో జెనరేటర్ ఏర్పాటు చేసుకుని నిరంతరంగా ఆక్సిజన్ ఉత్పత్తి కొనసాగేలా చూస్తామన్నారు.
అదే సమయంలో ఉత్పత్తితో పాటు ఆక్సిజన్ స్టోరేజీ మీద కూడా దృష్టి సారించామన్నారు. అనంతపురము సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేకంగా స్టోరేజీ ట్యాంకును నిర్మిస్తున్నామన్నారు.రానున్న రోజుల్లో జిల్లాలోని మరో మూడు ఆసుపత్రుల్లో ఇటువంటి ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టనున్నామన్నారు. కదిరి ఏరియా ఆసుపత్రి, ఆనంతపురము సర్వజన మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మూడు జెనరేషన్ ప్లాంట్లను నిర్మిస్తామన్నారు.
ఇన్నాళ్లూ ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఆక్సిజన్ సప్లైలు, సిలిండర్ల మీద ఆధారపడిన అనంత జిల్లాను ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్లు నిర్మించుకుని 40 కిలో లీటర్ల ఆక్సిజన్ స్టోరేజీ చేసుకోగల సామర్థ్యం కలిగిన జిల్లాగా అభివృద్ధి చేసుకోగలిగామన్నారు. జిల్లా వైద్య రంగంలో గత యాభై ఏళ్ల కాలంలో ఎప్పుడూ జరగనంత మౌలిక వసతుల అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో చేశామన్నారు. అదే అభివృద్ధిని కొనసాగిస్తూ ఈ నెల 30వ తేదీన పెనుగొండ సమీపంలో 57 ఎకరాలలో హిందూపురం పార్లమెంటు నియోజక వర్గానికి మెడికల్ కలశాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంతో శ్రీకారం చుడతామన్నారు.
అతి తక్కువ సమయంలో ఆక్సిజన్ ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ, డీఆర్డీవో సంస్థలు, జేసీ సిరి బృందం, పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి, సహకరించిన ప్రజా ప్రతినిధులు మరియు పుర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.