విజయనగరం జిల్లా వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి ఈనెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి శ్రీకారం చుడుతున్నారని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. ఈ కళాశాల శంకుస్థాపనా కార్యక్రమానికి పకడ్భంధీగా ఏర్పాట్లు చేయాలని, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శంకుస్థాపనా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై తన ఛాంబర్‌లో గురువారం సమీక్షించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ఆన్‌లైన్ ద్వారా, బోధనాసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. కళాశాల నిర్మాణానికి గాజులరేగవద్ద సేకరించిన స్థలంలోనూ, కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరం వద్దా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన సాంకేతిక పరికరాలను మందుగానే సిద్దం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్‌సిలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేటట్లు చూడాలన్నారు. తక్షణమే స్థలాన్ని చదునుచేసి, పనులు ప్రారంభించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో, పకడ్భందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, ట్రాన్స్‌కో ఎస్ఇ వై.విష్ణు, ఎపిహెచ్ఎంఐడిసి ఎస్ఇ కె.శివకుమార్, ఇఇ ఎం.సత్యప్రభాకర్, ఐఅండ్ పిఆర్ డిఇ రమణ, తాశీల్దార్ ఎం.ప్రభాకర్, ఎపి స్వాన్, బిఎస్ఎన్ఎల్, కలెక్టరేట్ తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.