కోవిడ్ తగ్గినప్పటికీ, కొన్నిరోజులపాటు జాగ్రత్తలు పాటించాలని, ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ సూచించారు. నెల్లిమర్ల మిమ్స్ కోవిడ్ ఆసుపత్రి నుంచి, పదిరోజుల చికిత్స అనంతరం, వ్యాధిని నయం చేసుకొని 22 మంది గురువారం డిస్‌ఛార్జి అయ్యారు. వీరికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైద్య బృందం వీడ్కోలు పలికింది. వారికి వాహనాలు ఏర్పాటు చేసి, స్వస్థలాలకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, రోగులకు జాగ్రత్తలు చెప్పారు. వ్యాధికి చికిత్స చేసుకున్నప్పటికీ, కనీసం పదిరోజులపాటు అయినా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైనంతవరకూ ఇంట్లోనుంచి రాకుండా, ఐసోలేషన్‌లో ఉండాలని అన్నారు. వ్యాధిని ఎదుర్కొనాలంటే, మనోధైర్యం చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. వారికి వైద్యం ఏవిధంగా అందిందీ, మందులు, ఇంజక్షన్లు ఇచ్చిందీ లేనిదీ వాకబు చేశారు. సిబ్బంది సేవలపై ఆరా తీశారు. కొన్నిరోజులపాటు మందులను జాగ్రత్తగా వాడాలని సూచించారు. వారికి డ్రైఫ్రూట్స్, అవసరమైన మందులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మిమ్స్ మెడికల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ హరికిషన్ సుబ్రమణ్యం, మెడికల్ సూపరింటిండెంట్ ఐ.భాస్కరరాజు, మెడికల్ డైరెక్టర్ సి.రఘురామ్, ప్రిన్సిపాల్ సిహెచ్ లక్ష్మీకుమార్, హెచ్ఆర్ నుంచి శ్రీనివాస్, వెల్ఫేర్ ఆఫీసర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.