దివ్యాంగులకు సుగమ్యా భారత్ యాప్..


Ens Balu
4
Srikakulam
2021-05-27 10:24:17

దివ్యాంగులకు సుగమ్యా భారత్ యాప్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,  వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు కె.జీవనబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేస్తూ భారత ప్రభుత్వ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సుగమ్యా భారత్ యాప్ ను జాతీయ స్థాయిలో ప్రారంభించారన్నారు. సమాజంలో తమ జీవన విధానంలో  వివిధ సదుపాయాల లభ్యతను దివ్యాంగులు తెలుసుకునే అవకాశం సుగమ్యా భారత్ యాప్ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్స్, వైద్య శాలల్లో సులభంగా నడిచే దారులు,   వాహానాల పార్కింగ్, సులభమైన భవన ప్రవేశ ద్వారాలు, అంతర్గత సదుపాయాలు, సులభమైన కారిడార్, రిసప్షన్, లిఫ్ట్ ఎలివేటర్, మరుగుదొడ్లు, మెట్ల మార్గం, మంచినీళ్ళ సదుపాయం, సులభమైన సంకేతాలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. దివ్యాంగులు సుగమ్యా భారత్ యాప్ ను ఆన్ లైన్ ద్వారా తెరచి వారి సలహాలు, సూచనలు పొందుపరచ వచ్చని తెలిపారు. పొందుపర్చిన విషయాలను నేరుగా భారత ప్రభుత్వ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకొని చర్య చేపడుతుందని వివరించారు. శ్రీకాకుళం జిల్లా దివ్యాంగులు అందరూ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. యాప్ ను మోబైల్ ఫోన్ లో  ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని అన్నారు. డౌన్ లోడ్ అనంతరం భారత ప్రభుత్వం జారీ చేసే యూనిక్ డిజెబిలిటీ ఐడి కార్డు సెంటర్ తో అనుసంధానం అయి వినియోగించ వచ్చని సూచించారు.

సిఫార్సు