రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కేలండర్ ప్రకారం వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోందని, పూర్తిస్థాయిలో వీటి ఫలితాలు లబ్ధిదారులకు సరైన సమయంలో అందించడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. జేసీ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ పథకాలు, వార్షిక రుణ ప్రణాళిక కింద వివిధ రంగాల్లో చేపట్టే కార్యక్రమాల్లో బ్యాంక్ సంబంధిత అంశాల్లో పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గం. వరకు జనరల్ పబ్లిక్‌ను బ్యాంకులలోకి అనుమతించి, ఆపై సాయంత్రం 5 గం. వరకు అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల దరఖాస్తుల పరిష్కారం, అంతర్గత బ్యాంకు వ్యవహారాలకు ఉపయోగించాలని సూచించారు. సమాచార మార్పిడికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవాలని, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు సాగించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకులు క్రియాశీలపాత్ర పోషించాలని, రుణాల మంజూరు, దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాల్లో పురోగతిపై ప్రతివారం సమీక్షించనున్నట్లు తెలిపారు. 2021, మే 26 నాటికి జగనన్న తోడు (గ్రామీణ) కింద 96.26 శాతం మేర రుణాల పంపిణీ పూర్తయిందని, అదే విధంగా పీఎం స్వానిధి కింద 19,464 మందికి రుణాలు మంజూరైనట్లు తెలిపారు. వైఎస్సార్ బీమాకు సంబంధించి డేటా ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సూచించారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలగాలంటే ఖరీఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని, సమయాన్ని ఆదాచేసేందుకు ఆర్‌బీకేల స్థాయిలో డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇందులో వీఏఏలు, బిజినెస్ కరస్పాండెంట్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఎల్‌డీఎం జె.షణ్ముఖరావు, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు, కంట్రోలర్లు తదితరులు పాల్గొన్నారు.