కోవిడ్ ఇన్‌పేషెంట్ రక్షణ మరియు చికిత్స నిర్వహణ మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వైద్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం రిమ్స్‌లో ఈ విషయంపై కోవిడ్ డ్యూటీ డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేషెంట్‌కేర్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీలులేదన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు మానసికంగా ధైర్యం చెప్పాలని ఆయన సూచించారు. చికిత్స చేస్తున్న వైద్యులను దేవుళ్లుగా బాధితులు భావిస్తున్నారని, వైద్య ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా
కఠినచర్యలు తప్పవని చెప్పారు. బెడ్ మేనేజ్‌మెంట్ పకడ్భందీగా ఉండాలని కలెక్టర్ పునరుద్ఝాటించారు. రోగుల పరిస్థితిని నిరంతరం గమనిస్తూవుండాలని, కోలుకున ్నవారిని వెంటనే డిశ్చార్జీ చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలవల్ల ప్రస్తుతం ఆక్సిజన్ కొరత లేదని ఆయన ప్రకటించారు. ఆక్సిజన్ వినియోగంలో వృధాను అరికట్టాలని చెప్పారు. కోవిడ్ విధుల్లో పాల్గొంటున్న జూనియర్ డాక్టర్లకు, ఇతర కింది స్థాయి సిబ్బందికి ఒక రోల్‌మోడల్‌గా నిలువాలని వైద్యులకు ఆయన సూచించారు. నోడల్ ఆఫీసర్ గా వున్న జాయింట్ కలెక్టర్ కె. క్రి ష్ణవేణి మాట్లాడుతూ వైద్య సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే బాధితులు త్వరగా కోలుకుంటారని అన్నారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అందరూ మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం వుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.ఎస్. చేతన్ (సచివాలయాలు, అభివృద్థి), రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, డిప్యూటి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణారెడ్డి, ఆర్.ఎమ్.ఓ. వేణుగోపాల రెడ్డి, ఎ.పి.ఎమ్.ఎస్. ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి తదితరులు పాల్గొన్నారు.