తక్షణమే కాలువలు శుభ్రం చేయండి..
Ens Balu
3
విశాఖ సిటీ
2021-05-27 17:25:12
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లోని కాలువలు తక్షణ శుభ్రం చేయాలని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అధికారులను ఆదేశించారు. గురువారం ఐదవ జోన్, 61వ వార్డు నందు పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. రోడ్లను, కాలువలను శుభ్రం చేసి వెంటవెంటనే డంపింగ్ యార్డ్ తరలించాలని శానిటరి సూపర్వైజర్ ను ఆదేశించారు. కాలువలలోను, రోడ్లపైన ఎక్కడా చెత్త కనిపించకూడదని, ప్రతిరోజూ శానిటరి ఇన్స్పెక్టర్ మరియు వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిలు వారి పరిధిలోని రోడ్లను, కాలువలను పరిశీలించాలని, పారిశుద్ధ్య సిబ్బందికి తడి-పొడి చెత్త వేరువేరుగా తీసుకునే విధంగా సూచనలు ఇవ్వాలని, స్థానిక ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని, రోడ్డుపైన, కాలువలలోను చెత్త వేసినచో ఆ చుట్టు ప్రక్కల ఉన్నఇళ్లకు, దుకాణాలకు అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. ప్రతీ దుకాణం ముందు మూడు డస్ట్ బిన్లు ఉండేలా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు దృష్టిలో ఉంచుకొని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా, కుండీలలోని నీరు ఎక్కువకాలం నిల్వ ఉంచకూడదని, వారంలో ఒక రోజు “డ్రై” డే పాటించాలని స్థానిక ప్రజలకు సూచించారు. ఇంటి ఆవరణలో కొబ్బరి బొండాలు గాని, ప్లాస్టిక్ వస్తువులు గాని లేకుండా చూడాలని, పూల కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిని ఆదేశించారు. ఈ పర్యటనలో శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.