అంగన్వాడీలో నాడు నేడు పనులు..
Ens Balu
2
Srikakulam
2021-05-28 15:36:23
అంగన్వాడీ భవనాలను నాడు నేడు క్రింద ఆధునికీకరణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో మరమ్మతులు చేపట్టి ఆధునీకరణ చేయుటకు నిర్ణయించిందన్నారు. ఒక భవనాన్ని 9 అంశాల్లో మరమ్మతులు చేయుటకు అవకాశం కల్పిస్తూ రూ.6.90 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. జిల్లాలో 190 అంగన్వాడీ భవనాలు మొదటి దశలో చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ భవనాలలో మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, పైకప్పు మరమ్మతులు, ఫ్లోరింగ్, మంచి విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, గ్రీన్ చాక్ బోర్డు, వాష్ బేసిన్, కిచెన్, విద్యుత్ కనెక్షన్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయని ఆయన అన్నారు. వీటని చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి అంశంలో నాణ్యత పాటించాలని ఆయన స్పష్టం చేశారు. మరమ్మతులకు సంబంధించిన అంచనాలు వేయాలని, వాటిని ఫోటోలతో సహా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నాడు నేడు క్రింద పాఠశాలల్లో అత్యంత ఆహ్లాదకరంగా తయారు చేయడం జరిగిందని అవసరమైతే వాటిని సందర్శించి చక్కని వాతావరణంలో అంగన్వాడీ కేంద్రాలు ఉండే విధంగా మరమ్మతులు చేపట్టి చిన్నారులను ఆకర్షించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని గుర్తించాలని, అందుకు అనుగుణంగా చిన్నారులను దృష్టిలో పెట్టుకొని పైకప్పు మరమ్మతులు చేపట్టడంలో గాని, తలుపులు, కిటికీలు అమర్చడంలో గాని రాజి వుండరాదని అన్నారు. ఫ్లోరింగ్ చక్కగా ఉండే విధంగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. ఇదే సమయంలో మంజూరు చేసిన నిధులతో ప్రహరీ గోడలు నిర్మించరాదని స్పష్టం చేశారు. ప్రహరీ గోడలను ఉపాధి హామీ పథకంలో మాత్రమే నిర్మించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి. శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి.వేణుగోపాల్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.జయదేవి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, విద్యుత్ సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్.మశిలామణి, డిఈ జి.టి ప్రసాద్, ఏడిఇ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.