రైతులకు ఎరువులు సకాలంలో అందాలి...
Ens Balu
3
Srikakulam
2020-08-29 17:00:42
శ్రీకాకుళం జిల్లాలో రైతులకు ఎరువుల సరఫరాలో జాప్యం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ కె.యు.పి.రమణితో శని వారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎరువుల సరఫరా పరిస్ధితిని సమీక్షించారు. రైతులకు అవసరమగు ఎరువులను పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉండేవిధంగా కృషి చేయాలని అన్నారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడుతూ సకాలంలో సరుకు జిల్లాకు చేరుటకు ప్రయత్నించాలని సూచించారు. ఎరువులను మండలాలకు అవసరం మేరకు తక్షణం సరఫరా జరగాలని పేర్కొన్నారు. పాతపట్నం, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, మెళియాపుట్టి, భామిని, లావేరు, సంతకవిటి మండలాలకు యూరియా అవసరం ఉందని దానిని వెంటనే సరఫరా చేయాలని సూచించారు. ఇ – క్రాప్ బుకింగ్ వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో 14,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని అందులో 7 వేల మెట్రిక్ టన్నులు సరఫరా ఇప్పటికే జరిగిందన్నారు. మిగిలిన నిల్వలను కొద్ది రోజుల్లో పంపిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. యూరియా అందిన వెంటనే పంపిణీ చేయుటకు ఏర్పాట్లు చేసామని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ క్వాలిటీ కంట్రోల్ సహాయ సంచాలకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.