శ్రీకాకుళం జిల్లాలో వివిధ పథకాల కింద మంజూరైన గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభం కావాలని అన్నారు. మోడల్ హౌసింగ్ కాలనీ లేఅవుట్ లో వారం రోజులలో అన్ని గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. జిల్లాలో 742 లేఅవుట్లు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ పూర్తయిన మేరకు నిర్మాణ పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న లబ్ధిదారులకు మంజూరైన గృహాలను కూడా తక్షణం ప్రారంభించాలని వారికి సిమెంటు, ఇనుము అందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో వివిధ పథకాల కింద మొత్తం లక్షా పది వేల గృహాలు మంజూరు అయ్యాయని ఆయన వివరించారు. లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి నిర్మాణ ప్రక్రియను గూర్చి అవగాహన కలిగించాలని ఆయన చెప్పారు. ప్రతి గ్రామంలో కనీసం 20 గృహాల నిర్మాణ పనులు ప్రారంభించవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత సీజన్లో గృహ నిర్మాణ పనులు చేసుకునే అవకాశం ఉందని, లబ్ధిదారులు సిద్ధంగా ఉంటారని ఆయన పేర్కొంటూ గృహ నిర్మాణ పనులు చేసుకునే లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం క్రింద వేతనంగా దాదాపు 18 వేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. పొజిషన్ సర్టిఫికెట్ అందని వారికి త్వరితగతిన అందించుటకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో కనీసం 25 వేల గృహ నిర్మాణ పనులు వారం రోజుల్లో ప్రారంభం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గృహాన్ని మ్యాపింగ్ చేయాలని, ఇప్పటి వరకు జిల్లాలో 91 శాతం మాత్రమే మ్యాపింగ్ జరిగిందని ఆయన పేర్కొంటూ మ్యాపింగ్ జరిగిన వాటిలో 80 శాతం వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి జరిగిందని మిగిలిన వాటికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పాలకొండ, ఇచ్చాపురం ప్రాంతాల్లో పనులు ప్రారంభంలో వెనుకబడి ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. జగనన్న ఆదర్శ కాలనీలలో పనుల చేపట్టుటకు నీటి సౌకర్యం అవసరమని, అన్ని కాలనీల్లో అవసరం మేరకు బోర్లను వేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే 504 బోర్లను వేయడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సంగతిని గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు గుర్తించాలని అందుకు అనుగుణంగా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు ప్రారంభం కావాల్సిందేనని ఆయన చెప్పారు. ప్రతి లేఅవుట్ వద్ద విద్యుత్, నీరు ఉండాలని తదనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టవచ్చని అన్నారు. విద్యుత్తును ఈ నెలాఖరు నాటికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించిందని, అతి త్వరిత గతిన పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని విద్యుత్ ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. లేఅవుట్ ల వద్ద వేసిన బోర్లకు తక్షణం విద్యుత్ సౌకర్యం కల్పించి నీటిని నిల్వ చేసే అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు బోర్ల కోసం రిజిస్ట్రేషన్ చేయని వాటికి తక్షణం రిజిస్ట్రేషన్ చేయించాలని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే విద్యుత్తును అందించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ టి. శ్రీనివాస రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.వేణుగోపాల్, ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. మశిలామణి, డిఇ జిటి ప్రసాద్, ఏడిఇ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.