బ్లాక్ ఫంగస్ పై మరింత అప్రమత్తం..
Ens Balu
3
Srikakulam
2021-05-28 15:46:56
కరోనాతో కోలుకున్న తరువాత వచ్చే బ్లాక్ ఫంగస్ అనే కొత్త రకం ఫంగల్ ఇన్ఫెక్షన్ పై మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్యులకు సూచించారు. శుక్రవారం ఉదయం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ వ్యాధిపై వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ వ్యాధి జిల్లాలో ప్రబలుతున్నందున దాన్ని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధిబారిన పడిన వారికి అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, బెడ్లు, ప్రత్యేక వార్డులు వంటి కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్లాక్ ఫంగస్ వివిధ ప్రాంతాల్లో విస్తృతం అవుతుందని, జిల్లాలో బ్లాక్ ఫంగస్ విస్తృతి కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా బాధితులకు వైద్యులు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అవసరమైన కల్చర్ టెస్ట్ నిర్వహించి దానిని పరిశీలన ఆధారంగా చికిత్స చేపట్టే అవకాశాన్ని కూడా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మ్యుకోర్ ఫంగస్ వలన బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని, కావున కోవిడ్ బాధితుల రోగ నిరోధక శక్తి పెరుగుటకు అవసరమైన పోషకాలను సూచించాలన్నారు. మ్యుకోర్మికోసిస్ వల్ల కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నందున, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కోవిడ్ చికిత్సకు ఉపయోగించే మందుల ఆధారంగా తగు సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్,సుపరింటెండెంట్ కృష్ణమూర్తి,ఆర్.ఎం.ఓ అరవింద్, రిమ్స్ నోడల్ ఆఫీసర్ చలమయ్య, ప్రొఫెసర్ పరశురాం, ప్రొఫెసర్ జ్యోతిర్మయి,ప్రొఫెసర్ ఉషారాణి,ప్రొఫెసర్ ప్రభాకర్,ప్రొఫెసర్ పాపరత్నం,డాక్టర్ కళ్యాణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.