హిందూస్తాన్ లీవర్ 50 ఆక్సిజన్ మిషన్లు వితరణ..
Ens Balu
3
Kakinada
2021-05-28 15:54:56
కోవిడ్ వైరస్ కట్టడికి, రోగులకు వైద్య, ఇతర సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో భాగస్వామ్యం అవుతూ హిందుస్థాన్ యూనీలీవర్-హార్లిక్స్ ఫ్యాక్టరీ (రాజమహేంద్రవరం) 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చింది. ఈ మేరకు శుక్రవారం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశను కలిసి ఫ్యాక్టరీ సైట్ హెడ్ శ్రీధర్, హెచ్ఆర్ హెడ్ సతీష్‌కుమార్ కాన్సంట్రేటర్లను అందించారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో జేసీ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కోవిడ్ రోగులకు ప్రాణవాయువును అందించే దాదాపు రూ.25 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించిన హార్లిక్స్ ఫ్యాక్టరీకి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ఈ కాన్సంట్రేటర్లు ఉపయోగపడతాయని.. వీటిని కోవిడ్ కేర్ కేంద్రాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోని స్థిరీకరణ కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. హిందుస్థాన్ యూనీలీవర్-హార్లిక్స్ ఫ్యాక్టరీకి జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సంస్థకు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.