రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మే 31న ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చ్యువల్‌గా శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని గాజులరేగ వద్ద వైద్య కళాశాల ఏర్పాటుకోసం కేటాయించిన 70 ఎకరాల స్థలంలో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటవుతోందని, కళాశాల భవనాల నిర్మాణం పనులు నిర్వహించేందుకు నిర్మాణసంస్థను కూడా ఖరారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వైద్య కళాశాల శంకుస్థాపన పనులపై జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి. జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులతో కలసి శనివారం వైద్య కళాశాల శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. 150 మంది ప్రాంగణంలో కూర్చొని వీక్షించేలా మూడు ఎల్.ఇ.డి. స్క్రీన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమం జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్‌పంపిణీ సంస్థ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు వీలుగా ఫైబర్‌నెట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. శంకుస్థాపన శిలాఫలకం, వేదిక బ్యాక్ డ్రాప్ వంటి ఏర్పాట్లను ఏపి వైద్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని ఇ.ఇ. సత్యప్రభాకర్‌ను ఆదేశించారు. కళాశాల భవనాల ఆకృతులను జిల్లా కలెక్టర్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులకు ఇ.ఇ. సత్య ప్రభాకర్ చిత్రపటాల ద్వారా చూపించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వైద్య పరమైన సౌకర్యాలు తక్కువగా వున్నందున ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా విశాఖలోని కె.జి.హెచ్.కు వైద్యం కోసం వెళ్లే పరిస్థితి వుండేదని, జిల్లాలోనే ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు ద్వారా జిల్లాలో పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు కూడా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, జిల్లా ఇన్ చార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుల చొరవతో జిల్లాకు ముఖ్యమంత్రి వైద్య కళాశాల మంజూరు చేశారని, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కళాశాల ఏర్పాటు పట్ల జిల్లా ప్రజలంతా ఎంతో సంతోషంగా వున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన జిల్లాలోనే తగిన వైద్యం లభించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. సకాలంలో వైద్య కళాశాల భవనాలు పూర్తయి త్వరగా జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.
వై.ఎస్.ఆర్.సి.పి జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ప్రజల చిరకాలం వాంఛ అయిన ప్రభుత్వ వైద్య కళాశాల ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారి నేతృత్వంలో నెరవేరడం పట్ల ఎంతో ఆనందంగా వుందన్నారు. గత ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. గతంలోనూ పలువురు ముఖ్యమంత్రులు వైద్య కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చినా అవి నెరవేరలేదని, ఈ కళాశాల ఏర్పాటు ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారికే సాధ్యమయ్యిందన్నారు. వైద్యరంగంలో ఈ ప్రాంతం వెనుకబడి వుందన్న భావనతోనే జిల్లాకు ప్రభుత్వం ఈ ఉన్నత వైద్య విద్యా సంస్థను మంజూరు చేసిందని, రానున్న రోజుల్లో జిల్లాలోని గిరిజన ప్రాంత ప్రజలు సహా అన్ని వర్గాల వారికీ పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఈ వైద్య కళాశాల దోహదపడుతుందన్నారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే దీని ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్.డి.ఓ. బిహెచ్.భవానీశంకర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.జి.నాగభూషణ రావు, తహశీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.