కాకినాడ జీజీహెచ్‌లో నిష్ణాతులైన వైద్యులతో పాటు యువ నోడల్ అధికారులు, వైద్య, ఆరోగ్య సిబ్బందితో కోవిడ్ బాధితులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తెలిపారు. శనివారం ఉదయం జాయింట్ కలెక్టర్ కాకినాడ జీజీహెచ్‌ను సందర్శించారు. ట్రయాజింగ్ సెంటర్‌ను పరిశీలించి, అక్కడి బాధితులతో మాట్లాడారు. ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అందిస్తున్న వైద్య, ఇతర సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సహాయంతో ఇటీవల ఏర్పాటుచేసిన 10 కేఎల్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంకు పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో రోగులకు సజావుగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో వివిధ సంస్థలు, వ్యక్తులు సామాజిక బాధ్యతగా జిల్లాకు దాదాపు 300 వరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించారని, వీటిని కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ), గిరిజన ప్రాంతాల్లోని స్థిరీకరణ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ
డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచితంగా కోవిడ్ వైద్య సేవలందించడంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టర్ నేతృత్వంలో కోవిడ్ ఆసుపత్రుల్లోని వైద్య సేవలపై నిరంతర సమీక్ష జరుగుతోందని, ఆరోగ్యశ్రీ యేతర కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు, డీనోటిఫై చర్యలతో పాటు లైసెన్సు కూడా రద్దుచేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘనపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని, ఈ ఫిర్యాదులను జిల్లా క్రమశిక్షణ కమిటీ (డీడీసీ) పరిశీలించి, చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించిన డీసీసీబీ:
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) సామాజిక బాధ్యతగా కోవిడ్ రోగులకు ఆపన్నహస్తం అందించేందుకు అయిదు లీటర్ల సామర్థ్యమున్న పది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను జీజీహెచ్‌కు అందించింది. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ), డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జ్ డా. జి.లక్ష్మీశ చేతులమీదుగా డీసీసీబీ అధికారులు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు కాన్సంట్రేటర్లను అందించారు. దాదాపు రూ.ఏడు లక్షల విలువైన కాన్సంట్రేటర్లను అందించిన డీసీసీబీకి జేసీ అభినందనలు తెలియజేశారు. మరింత మంది సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి కోవిడ్ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతోపాటు ఇతర వైద్య ఉపకరణాలను అందించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీజీహెచ్ కోవిడ్ నోడల్ అధికారి సూర్యప్రవీణ్‌చాంద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి, డీసీసీబీ సీఈవో పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.