కరోనా కట్టడికి అందరి భాగస్వామ్యం అవసరం..


Ens Balu
2
Dharmavaram
2021-05-29 11:23:44

 కరోనా కట్టడికి అందరి భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.  శనివారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 30  పడకల సామర్థ్యంతో జిల్లాలోనే ప్రప్రథమంగా నిర్మించిన  క్రౌడ్ ఫండెడ్ కోవిడ్ హాస్పిటల్ ను స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ బాధితుల కోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతోందన్నారు. గడచిన రెండు నెలల కాలంలో ఏప్రిల్ మొదటి వారంలో 3.10 శాతం, రెండో వారంలో 7.54, మూడో వారంలో 10.96,  నాలుగో వారంలో 21.43 శాతం, మే నెల మొదటి వారంలో 30.47 శాతం, రెండవ వారంలో 37.08, మూడోవారంలో 32.18, నాల్గవ వారంలో 24.70 శాతంగా పాజిటివ్ రేటు నమోదైందన్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఏప్రిల్ మొదటి వారం నుండి క్రమంగా పెరుగుతూ మే మూడో వారం నుండి పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది విడతల ఫీవర్ సర్వే చేపట్టి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. 

తాడిపత్రి ఆర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ బెడ్ లతో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి, అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో 250 ఆక్సిజన్ బెడ్లతో జర్మన్ హ్యాంగర్స్ పద్ధతిన తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాట్ల పనులు తుదిదశకు  చేరుకున్నాయన్నారు. గ్రామస్థాయిలో కరోనా కట్టడి చేయడానికి ప్రత్యేక వసతి సౌకార్యలు లేనివారికోసం ప్రతి గ్రామంలో విలేజ్ ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు , దాతలను సమన్వయం చేసుకుని ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. కరోనా కట్టడికి సర్పంచుల ఆధ్వర్యంలో కరోనా కట్టడి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే మండల,మున్సిపల్ స్థాయిలలో కరోనా కట్టడికి కరోనా వార్ రూములు కూడా ఏర్పాటు చేశామన్నారు. మొదటి దశలో కరోనా వ్యాప్తి పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉండగా, రెండో దశలో గ్రామీణ ప్రాంతాలలో కూడా కరోనా వ్యాప్తి అధికంగా ఉందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో మరియు పట్టణంలోని దాతల సహకారంతో ఇటువంటి ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు


 ప్రైవేట్ ఆస్పత్రుల పై కఠిన చర్యలు తప్పవు :జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరిక

కోవిడ్ రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రులకు జరిమానా విధించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా రోగుల నుండి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు యాజమాన్యం వసూలు చేసిన ఫీజుకు పది రెట్లు అధికంగా జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. మొదటి తప్పుగా జరిమానా అనంతపురం లోని నాలుగు ఆసుపత్రులపై  సుమారు రూ. 9లక్షల 55 వేలు జరిమానా విధించడం జరిగిందని, రెండోసారి తప్పులు చేస్తే ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ లింగాల నిర్మల, ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మలత తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు