విజయనగరం జిల్లాలో మనబడి నాడు - నేడు తొలివిడత లో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులను జూన్ 20లోగా పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు ఇంజనీరింగ్ విభాగాలను ఆదేశించారు. జిల్లాలో తొలివిడతలో 1060 పాఠశాలల్లో ఆరు ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో పనులు చేపట్టడం జరిగిందని వీటిల్లో చేపట్టిన పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నాడు- నేడు పనులపై జె.సి. శనివారం కలెక్టర్ కార్యాలయం లోని తన ఛాంబర్ లో సమీక్షించారు. పాఠశాలల కు మెటీరియల్ సరఫరా చేసే సరఫరా దారు డ్యూయెల్ డెస్క్ లు, గ్రీన్ చాక్ బోర్డ్, తాగునీటి శుద్ధి పరికరాలు, టీవీ లు, ఫర్నిచర్ ఇప్పటికే అందజేసారనీ వాటి ఏర్పాటు జూన్ 6వ తేదీ నాటికీ పూర్తి కావాలన్నారు. వాల్ ఆర్ట్, పెయింటింగ్స్ 20 నాటికీ అన్ని స్కూళ్ళలో పూర్తికావాలని గిరిజన ప్రాంత పాఠశాలల్లో పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి, సమగ్ర శిక్ష ఏపిఓ గోపి, ఇ.ఇ. శివానంద్, ఏ.పి.ఇ.డబ్ల్యు.డి.సి. శామ్యూల్, విఎంసి ఇ.ఇ. దిలీప్ తదితరులు పాల్గొన్నారు.