పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్ అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేసి లబ్దిదారుల ఇళ్ళు నిర్మాణం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం నర్సరావుపేటలో ఉప్పలపాడు వద్ద ఏర్పాటు చేసిన పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్ను, నర్సరావుపేట జిల్లా ఆసుపత్రి వద్ద జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటరును, మేడికొండూరు మండలం జంగంగుంట్ల పాలెంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. నర్సరావుపేట ఉప్పలపాడు వద్ద పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, నర్సరావుపేట శాసనసభ్యులు డా. గోపిరెడ్డి శ్రీనివారెడ్డి, నర్సరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. లే ఆవుట్లో ప్లాట్ మార్కింగ్, అదనపు భూమి సమీకరణపై జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ అప్రూవల్ కు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా లే అవుట్ ప్లాన్ను వెంటనే తయారు చేసి జిల్లా కమిటీ వద్ద అనుమతి తీసుకొని మార్పుల పనులు ప్రారంభించాలన్నారు. ఇప్పటికే మార్కింగ్ చేసిన ప్లాట్లను జియో ట్యాగింగ్ చేసి , ఇళ్ళ నిర్మాణంను ప్రారంభించాలన్నారు. లే అవుట్ విస్తరణకు అవసరమైన భూముల సమీకరణ వెంటనే ప్రారంభించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూ యజమానులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు వారిని ఒప్పించి భూములు సమీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నర్సరావుపేట జిల్లా ఆసుపత్రి వద్ద లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను, జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ కేర్ సెంటరును పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి కోవిడ్ కేర్ సెంటరును వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ మేడికొండూరు మండలంలోని జంగంగుంట్ల పాలెంలో నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం, ఆర్బీకే భవనాలను పరిశీలించారు. నిర్దేశిత సమయంలో భవనాల నిర్మాణం పూర్తి అయ్యేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్ల భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, బీఎంసీలు, ఏఎంసీల నిర్మాణానికి అవసరమైన భూములు గుర్తించేందుకు తహశీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, తహశీల్దారు రమణా నాయక్, ఎంపీడీవో బూసిరెడ్డి, మేడికొండూరు తహశీల్దారు కరుణ కుమార్, ఎంపీడీవో శోభారాణి , పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.