కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు ప్రభుత్వ నిబంధనలను, ఆరోగ్య జాగ్రత్తలను తూ. చ. తప్పకుండా పాటించాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. శనివారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో 30 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో జిల్లాలోనే మొట్టమొదటి 'క్రౌడ్ ఫండెడ్ కోవిడ్ హాస్పిటల్' జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారినుండి ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు అనవసరంగా బయటకు వస్తున్నారని, గుంపులుగుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారని అందువల్ల కరోనా ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు కూడా కరోనా కట్టడికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మవరం దాతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని , భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.