మే 31న సుందరకాండ పారాయణం..
Ens Balu
3
Tirumala
2021-05-29 11:59:56
కరోనా వ్యాధి నిర్మూలనకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు కోరుతూ ఇప్పటివరకు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా మే 31వ తేదీన అఖండ సుందరకాండ పారాయణం నిర్వహిస్తామని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని ధర్మగిరి ఎస్వీ వేద విజ్ఞాన పీఠంలో గల ప్రార్థనా మందిరంలో శనివారం అఖండ పారాయణం ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుండి లంఘించి సీతాన్వేషణ కోసం ఏవిధంగా అవిశ్రాంతంగా కర్తవ్యదీక్ష చేశారో అదేవిధంగా ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు 16 గంటల పాటు నిరంతరాయంగా అఖండ సుందరకాండ పారాయణం చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం నాలుగు బృందాల్లో 40 మంది పండితులు పారాయణం చేసేందుకు వీలుగా ఇక్కడి ప్రార్థనా మందిరంలో ఏర్పాట్లు చేపడుతున్నట్టు చెప్పారు. హోమం ఏర్పాటు చేసి ప్రతి శ్లోకం తరువాత హవనం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని, భక్తులు తమ ఇళ్ల నుండే శ్లోకాలను పారాయణం చేయవచ్చని చెప్పారు. పారాయణం చేయలేని వారు శ్లోకాలను వినాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రసారమయ్యే సమయంలో టీవీ సౌండ్ పెంచడం ద్వారా మంత్రపూర్వకమైన శ్లోకాల శబ్ద తరంగాలు వాతావరణంలో కలిసి శ్రీవారి ఆనుగ్రహం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో టిటిడి బోర్డు సభ్యులు శివకుమార్, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.