వైఎస్సార్ చేయూతకి ఆధార్ అనుసంధానం..
Ens Balu
3
Vizianagaram
2021-05-29 12:17:11
వైఎస్ఆర్ చేయూత పథకం కోసం, 45 ఏళ్లు నిండి, కొత్తగా ఈ ఏడాది దరఖాస్తు చేసుకొనే మహిళలు మాత్రమే తమ ఆధార్‌కు సెల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. గతేడాది ఈ పథకం కింద, రూ.18,750 లబ్ది పొందినవారికి మళ్లీ ఆధార్ లింకింగ్ అవసరం లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి 45 సంవత్సరాలు నిండుతున్న వారు మాత్రమే, ఆధార్ కేంద్రాలకు వెళ్లి, తమ ఫోన్ నెంబరును లింక్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ పథకానికి అర్హత పొంది, ఇది వరకూ ఆధార్ లింక్ చేసుకున్న మహిళలు, మరోమారు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తయిన వారికి ఈ పథకం వర్తించదని, వారి పేర్లు తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు తెలియజెప్పేందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు కృషి చేయాలని కోరారు. ఆధార్ అనుసంధాన కేంద్రాలకు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.