ప్రస్తుతం కోవిడ్ రెండోదశ సమయంలో పీఎం స్వనిధి పథకం ద్వారా 10,150 మంది లబ్ధిదారులకు త్వరితగతిన రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ), డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జ్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పట్టణ ప్రాంతాల్లో చిరువ్యాపారం, వీధివ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నవారికి డీసీసీబీ ద్వారా రూ.10 వేలు చొప్పున రుణాలు మంజురు జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12 గం. నుంచి ఉదయం 6 గం. వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్నందున వీధి వ్యాపారులు, ఇతర చిరు వ్యాపారాలు చేసుకొనే వారికి ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో పీఎం స్వనిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణాల మంజూరుకు మార్గదర్శకాలు ఇచ్చినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పట్టణప్రాంతాల్లోని 13 డీసీసీబీ శాఖల ద్వారా యుద్ధప్రాతిపదికన రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ లక్ష్మీశ తెలిపారు.
పథకం వివరాలు:
- లబ్ధిదారుల నుంచి ఎలాంటి చర, స్థిర ఆస్తులను సెక్యూరిటీగా తీసుకోబడదు.
- మున్సిపల్ విభాగం, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపు జరుగుతుంది.
- లబ్ధిదారులకు గుర్తింపు కార్డుతో పాటు లెటర్ ఆఫ్ రికమెండేషన్ (ఎల్‌వోఆర్) మంజూరు చేయడం జరుగుతుంది.
- లబ్ధిదారుడు 12 సమాన సెలసరి వాయిదాల్లో రుణాన్ని తిరిగి చెల్లించాలి.
- రుణాన్ని సకాలంలో చెల్లించిన వారికి ఏడు శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
- పథకానికి క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ ఫండ్, మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్రెడిట్ గ్యారెంటీ వర్తిస్తుంది.
- పథకం ద్వారా మంజూరు చేసిన అప్పు మొత్తాన్ని నాబార్డు నుంచి బ్యాంక్ రీఫైనాన్స్ పొందొచ్చు.
- పొదుపు ఖాతా ప్రారంభింపజేయడం, రుణ దరఖాస్తు పూరించడం, ఉదయ్ మిత్రా పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే బాధ్యతలను మున్సిపల్ వార్డు సచివాలయ సిబ్బంది (సీవో, ఆర్‌పీ) నిర్వర్తిస్తారు. మే 31 లోగా రుణాల మంజూరు లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది.